Fri Dec 05 2025 14:36:45 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : కోహ్లి కళ్లలో నీళ్లు.. స్టేడియం అంతా నిశ్శబ్దం.. ఆ క్షణాలు వర్ణించాలంటే
ఛాంపియన్ షిప్ తమదేనని భావించిన విరాట్ కోహ్లి మైదానంలో కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలతో అందరి కళ్లల్లో నీళ్లు నిలిచాయి

అహ్మదాబాద్ పిచ్ అంటే రెండు వందలకు పైగానే చేసిన మ్యాచ్ లు అనేకం ఉన్నాయి. అంతెందుకు మొన్నటి ఎలిమినేటర్ 2 మ్యాచ్ లోనూ ముంబయి ఇండియన్స్ 203 పరుగులు చేసినా దానిని పంజాబ్ కింగ్స్ సులువుగా అధిగమించింది. అలాంటిది నిన్న ఫైనల్స్ లో కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 190 పరుగులు చేయడంతో అభిమానులకు ఆ స్కోరు సరిపోలేదు. బ్యాటర్లు సక్రమంగా ఆడినా అంత స్కోరును సులువుగా పంజాబ్ ఛేజింగ్ లు దాటేస్తుందని అనుకున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఫ్యాన్స్ లో స్కోరు నెంబరు చూసి బెంగ మొదలయింది. ఇంత తక్కువ స్కోరు చేయడంతో ఇక ఈ ఏడాది కూడా ఛాంపియన్ షిప్ దొరకదేమోనన్న అనుమానంతో ఆందోళన బయలుదేరింది.
కప్పు చేతికి అందడం చూసి....
విరాట్ కోహ్లి అభిమానుల్లో కూడా ఆనంద భాష్పాలు. తమ అభిమాన ఆటగాడు మైదానంలో కూర్చుని కళ్ల వెంట నీరు సుడులు తిరుగుతున్న వేళ స్టేడియంలో ఉద్విగ్న భరితమైన వాతావరణం నెలకొంది. విరాట్ కోహ్లి కొన్నేళ్లుగా ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అందినట్లే అంది ప్రతి ఏడాది కప్పు చేతికి అందకుండా పోతుంది. దురదృష్టం వెంటాడుతుంది. ఈ ఏడాదికూడా ఆ అదృష్టం దక్కుతుందో లేదో? అన్న భయం అందరిలోనూ ఉంది. ఈ ఆలోచనలు కేవలం విరాట్ కోహ్లిలో మాత్రమే కాదు. లక్షలాది మంది అభిమానుల్లో ఉన్నాయి. అయితే చివరి బంతికి శశాంక్ సిక్స్ కొట్టినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుదే విజయం కావడంంతో అందరూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.
ప్రతి మ్యాచ్ ను కసిగా...
మరో ఓవర్ ఉన్నప్పుడు ఎక్కువ పరుగుల లక్ష్యం పంజాబ్ కింగ్స్ ఎదుట ఉన్నప్పుడు విరాట్ కోహ్లి కళ్లలో నీళ్లు తిరిగాయి. కెమెరాలన్నీ విరాట్ నే చూపించాయి. బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూనే ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోవడం ప్రపంచమంతా చూసింది. ఎంత భావోద్వేగమైన క్షణాలివి. విరాట్ కోహ్లికి ఏం తక్కువ? ఎన్ని కప్పులు రాలేదు. ఇది ఒక లెక్కా. కానీ విరాట్ అలా కాదు. ప్రతి మ్యాచ్ ను కసిగా తీసుకుని ఆడతాడు. ఓన్ చేసుకుంటాడు. అందుకే అలా ఉద్విగ్నతకు లోనయ్యాడు. పద్దెనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ ఛాంపియన్ షిప్ దక్కిందని తెలియడంతో ఇక కన్నీళ్లు ఆగలేకపోయాయి. క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిన క్షణాన విరాట్ కోహ్లీ కళ్లల్లో కన్నీళ్లు ఆగలేదు. సహచరులందరితో కలసి ఎగిరి గంతులు వేస్తూ చిన్న పిల్లాడి లా గ్రౌండ్ లో పండగ చేసుకున్నాడు.
Next Story

