Fri Dec 05 2025 13:03:11 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : ఇక టీం ఇండియాకు ఎదురు లేదు.. మరో విధ్వంసకర ఆటగాడు ఇడిగో
రాజస్థాన్ రాయల్స్ లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్ తో ఒక ఆటాడుకున్నాడు

ఐపీఎల్ లో మరో మెరుపు మెరిసింది. రాజస్థాన్ రాయల్స్ లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్ తో ఒక ఆటాడుకున్నాడు. అతి చిన్న వయసులో బ్యాట్ ను చేతబట్టి మైదానంలోకి అడుగుపెట్టిన ఈ పిల్లోడు భవిష్యత్ కు భారత్ కు మరో తురుపు ముక్క దొరికాడని అనిపించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న గత రెండు మ్యాచ్ లలో మాత్రమే వైభవ్ సూర్యవంశీ ఆడాడు. తొలి మ్యాచ్ లోని తొలి బంతినే సిక్సర్ కు నాడు పంపించినప్పుడు ఈ పిడుగు దగ్గర ఏదో ఫైర్ ఉందని అందరూ గుర్తించారు. అయితే తర్వాత అవుటయి కళ్ల వెంట నీళ్లు కారుతుండగా పెవిలియన్ దారి పట్టాడు. తర్వాత మ్యాచ్ లోనూ వైభవ్ సూర్యవంశీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా అతను ఆడే షాట్లను చూసి భారత్ కు మంచి ఆటగాడు భవిష్యత్ లో దొరికినట్లేనని భావించారు.
అతి చిన్న వయసులోనే...
పథ్నాలుగేళ్ల వయసుకే మైదానంలోకి అడుగు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. బ్యాట్.. బంతి..ని అంచనా వేసే వయసు కాదది. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం దుమ్ము దులిపేశాడు. నిన్న జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ ను ఓడించగలిగిందంటే అందుకు వైభవ్ సూర్యవంశీ కారణమని చెప్పక తప్పదు. పదకొండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో మోత మోగించాడు. స్టేడియంలో వైభవ్ సూర్యవంశీ బంతిని బాదినప్పుడల్లా నినాదాలు హోరెత్తిపోయాయి. అందులోనూ జైపూర్ లో మ్యాచ్ జరగడంతో ఇక రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ ఊగిపోయారు. కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేసి గతంలో ఉన్న రికార్డులన్నీ వైభవ్ సూర్యవంశీ చెరిపేశాడనే చెప్పాలి.
లక్ష్యాన్ని చూసి బెదరకుండా...
210 పరుగులు లక్ష్యం సాధించాలంటే కొంత బెరుకు ఉంటుంది. అందులోనూ అనుభవం లేదు. మైదానంలో ఆడింది లేదు. కానీ వైభవ్ సూర్యవంశీకి అవేమీ కనపడలేదు. తన బ్యాట్ కు బంతి మాత్రమే కనపడింది. పరుగుల సునామీ సృష్టించి జట్టును విజయం బాటన పట్టించగలిగాడంటే ఈ చిచ్చరపిడుగులో సత్తా ఏంటో ఎవరూ చెప్పకనే అర్థమవుతుంది. వైభవ్ సూర్య వంశీ బీహార్ నుంచి బ్యాట్ పట్టుకుని అతిచిన్న వయసులో రావడంతో అందరూ గేలిచేశారు. జోకులు వేశారు. అర్జునుడి కళ్లు పిట్ట మీద ఉన్నట్లు వాటిని పట్టించుకోని వైభవ్ సూర్యవంశీ మాత్రం కేవలం బంతిని చూస్తూ బాదేశాడు. ఫలితంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. భవిష్యత్ లో వాటిని పట్టించుకోని వైభవ్ సూర్యవంశీకి టీం ఇండియా జెర్సీ దక్కడం ఖాయమని తేలిపోయింది.
Next Story

