Fri Dec 05 2025 08:27:20 GMT+0000 (Coordinated Universal Time)
Asia Cup : పసికూనతో ప్రయోగాలు చేయడం మంచిదేనా?
ఆసియా కప్ లో నేడు టీం ఇండియా తన చివరి లీగ్ మ్యాచ్ ను ఒమన్ తో ఆడుతుంది.

ఆసియా కప్ లో నేడు టీం ఇండియా తన చివరి లీగ్ మ్యాచ్ ను ఒమన్ తో ఆడుతుంది. ఇప్పటికే యూఏఈ, పాకిస్తాన్ పై అద్భుతమైన విజయాన్ని సాధించిన భారత్ సూపర్ 4లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే అగ్రస్థానంలో నిలిచి టీం ఇండియాకు ఎదురులేదని అనిపించుకుంటుంది. నిజానికి టీం ఇండియా ఫామ్ తో పోలిస్తే ఒమన్ టీ 20 ఫార్మాట్ లో పసికూనగానే చెప్పుకోవాలి. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా సూపర్ ఫామ్ లో ఉన్న టీం ఇండియా జట్టు ఒమన్ పై అలవోకగా గెలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మార్పులుంటాయని...
అయితే ఈరోజు భారత్ జట్టులో ఏదైనా మార్పులు ఉండే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే సూపర్ 4లోకి అడుగుపెట్టిన జట్టు కావడంతో ప్రయోగాలు చేయడానికి ఈ మ్యాచ్ భారత్ కు ఉపకరించే అవకాశముంది. శుభమన్ గిల్ స్థానంలో యశస్వి జైశ్వాల్ ను దింపనున్నారన్నది ఒక వార్తవినిపిస్తుంది. మరి గిల్ వైస్ కెప్టెన్ కావడంతో అతనిని తప్పించే అవకాశం లేదన్న వాదన కూడా ఉంది. ఇక పేసర్ బుమ్రాకు ఈ మ్యాచ్ లో విశ్రాంతి నిచ్చే అవకాశాలున్నాయి. బుమ్రా స్థానంలో అర్ష్ దీప్ సింగ్ కు అవకాశం ఇవ్వనున్నారని అంటున్నారు.
బెంచ్ కే పరిమితమైన...
ఇక ఇప్పటి వరకూ బెంచ్ కే పరిమితమయిన రింకు సింగ్, జితేవ్ శర్మ లను కూడా ఈ మ్యాచ్ లో ఆడించే అవకాశాలు లేకపోతేదు. ఒమన్ తో విజయం సులువైనా టీ20లలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, అందుకే జట్టు బలహీనతను చూసి కాకుండా గెలుపుపైన ఫోకస్ పెట్టి జట్టు ఎంపిక ఉండాలని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అతి విశ్వాసం ఎప్పుడూ తగదని, మార్పులు జరిగినా.. ఫామ్ లో ఉన్నవారికి జట్టులో స్థానం కల్పిస్తేనే మంచిదని, దుబాయ్ పిచ్ కు ఇప్పటికే అలవాటు పడిన వారిని మార్చడం మంచిది కాదన్న సూచనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఒమన్ పై జట్టు ఎంపిక ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

