Sat Dec 13 2025 22:33:54 GMT+0000 (Coordinated Universal Time)
Goutham Gambhir : ఈయన ఉన్నాడే.. ఓటములకు ఈయనే పెద్ద కారణం
టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్న సమయంలో సాధించిన విజయాలు, ఇప్పుడు భారత జట్టు ఎదుర్కొంటున్న అపజయాలను పోల్చి చూపుతూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ జట్టు ప్రయోజనాలతో పాటు ఆటగాళ్ల సమిష్టిగా ఆడే పరిస్థితి నుంచి బయటకు తీసుకు రావడం వల్లనే ఈ వరస అపజయాలంటూ అనేక మంది మండి పడుతున్నారు. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాతనే టీం ఇండియా అనేక మ్యాచ్ లలో తడబడటానికి కారణం అని అంటున్నారు.
ఆస్ట్రేలియాతో సిరీస్...
ఆస్ట్రేలియాలోతో జరిగిన టెస్ట్ సిరీస్ ను కోల్పోవడంతో పాటు ఇటీవల కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లోనూ భారత బ్యాటర్ల వైఫల్యానికి గౌతమ్ గంభీర్ పైనే వేలు పెట్టి చూపుతున్నారు. నిందలన్నీ గంభీర్ పైనే పడుతున్నాయి. ఆటగాళ్లను కోచ్ గా మోటివేట్ చేయాల్సింది పోయి వారిపై తిట్ల పురాణం అందుకుంటే అది వారి ఆట తీరుపై ప్రభావం చూపతుందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. గంభీర్ ఏకపక్ష నిర్ణయాల కారణంగానే భారత్ వరస ఓటములను మూటగట్టుకోవాల్సి వస్తుందని కూడా అంటున్నారు.
మాజీ క్రీడాకారులు కూడా...
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైఫల్యం చెందారని, వెంటనే అతనిని మార్చేయాలని బీసీసీఐకి పెద్ద సంఖ్యలో మెయిల్స్ కూడా వస్తున్నాయని చెబుతున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా గౌతమ్ గంభీర్ దే తప్పు అని చెప్పడం విశేషం. స్పిన్ ను ఎలా ఎదుర్కొనాలన్న దానిపై ఆటగాళ్లకు సరైన కోచింగ్ ఇవ్వడంలో గంభీర్ విఫలమయ్యాడని మనోజ్ తివారీ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్ మెంట్ తీసుకోవడానికి కూడా గంభీర్ వ్యవహార శైలి అని అనుమానించాల్సి వస్తుందని అన్నారు. టీం ఇండియా జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ లయ తప్పడానికి కారణమన్న వ్యాఖ్యలు నెట్టింట ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా గౌతమ్ గంభీర్ తన వైఖరిని మార్చుకోవాలని కోరుతున్నారు.
Next Story

