Fri Dec 05 2025 17:52:44 GMT+0000 (Coordinated Universal Time)
Asia Cup : పాక్ పై టీం ఇండియా జట్టు ఇలా ఉంటే బాగుంటుందట
ఆసియా కప్ లో టీం ఇండియా శుభారంభాన్ని చేసింది. ఈ నెల 14వ తేదీన పాకిస్థాన్ తో దుబాయ్ లో భారత్ తలపడుతుంది.

ఆసియా కప్ లో టీం ఇండియా శుభారంభాన్ని చేసింది. ఈ నెల 14వ తేదీన పాకిస్థాన్ తో దుబాయ్ లో భారత్ తలపడుతుంది. అయితే పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు టీం ఇండియా సిద్ధమవుతుంది. యూఏఈతో తొమ్మిది వికెట్లతో సూపర్ విక్టరీ కొట్టిన ఉత్సాహంతో ఉన్న టీం ఇండియా అదే ఊపులో దాయాది పాక్ ను కూడా ఓడించాలన్న కసితో ప్రాక్టీస్ చేస్తుంది. అయితే పాకిస్తాన్ తో జరగనున్న మ్యాచ్ లో టీం ఇండియా జట్టులో ఏదైనా మార్పులు చేస్తుందా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పాక్ - భారత్ మ్యాచ్ అంటే అందరిలోనూ టెన్షన్ ఉంటుంది. ఖచ్చితంగా గెలవాలని ప్రతి భారతీయ క్రికెట్ అభిమాని కోరుకుంటారు.
ప్రాక్టీస్ లో భారత జట్టు...
అందుకే మరో రెండు రోజుల్లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభమవుతున్న సమయంలో జట్టులో మార్పులు, చేర్పులపై పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. అయితే దుబాయ్ లో ఉన్న జట్టు మాత్రం ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రాక్టీస్ పైనే దృష్టిపెట్టింది. పాక్ తో జరిగే మ్యాచ్ లో యూఏఈతో తలపడిన భారత జట్టునే కొనసాగించాలని కొందరు సోషల్ మీడియాలో కోరుతున్నారు. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కనుక ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం మంచిదన్న సూచనలు కూడా వెలువడుతున్నాయి. అయితే యూఏఈతో జరిగిన మ్యాచ్ లా ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ఇరుజట్ల ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు.
మార్పు ఉంటే...
అయితే భారత జట్టులో ఒక మార్పు ఉండే అవకాశముందని అంటున్నారు. పేసర్లుగా హార్ధిక్ పాండ్యా జస్ప్రిత్ బుమ్రాతో పాటు అర్షదీప్ సింగ్ ను తీసుకోవడంపై కూడా చర్చ జరుగుతుంది. అయితే అర్షదీప్ సింగ్ ను జట్టులోకి తీసుకుంటే ఒకరిని తప్పించాలి. అది వరుణ్ చక్రవర్తి అవుతాడంటున్నారు. అయితే వరుణ్ చక్రవర్తి సరైన సమయంలో వికెట్లు తీస్తాడని, అర్షదీప్ సింగ్ ఎక్కువ పరుగులు ఇచ్చే అవకాశముందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. దుబాయ్ పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండటంతో వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ ను యధాతధంగా కొనసాగించాలని కూడా కొందరు క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. మ్యాచ్ కు మరో రెండు రోజులు ఉండగానే జట్టులో మార్పులు, చేర్పులపై చర్చ జరుగుతుంది. కానీ చివరి నిమిషంలోనే జట్టు ను ప్రకటిస్తారని, అప్పటి వరకూ ఇవి ఊహాగానాలు మాత్రమేనన్నది వాస్తవం.
పాక్ తో ఆడనున్న భారత్ జట్టు (అంచనా) :
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ ( వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబె, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా
Next Story

