Fri Dec 05 2025 14:04:39 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : చెన్నై ఇక తప్పుకున్నట్లే... హైదరాబాద్ కు మాత్రం మిగిలి ఉన్న ఆశలు
చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది

చరిత్రను తిరగరాశామని చెప్పుకోవడానికి మించి ఏం మిగిలింది. చెన్నైను చపాక్ స్టేడియంలో ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించిందని జబ్బలు చరచుకున్నా.. ఈ సీజన్ లో అతి పేలవ ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగున చేరడానికి కారణాలు మాత్రం ఆ టీం వెతుక్కవడం లేదు. మిగిలిన మ్యాచ్ లన్నీ గెలిస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ కు కనీసం చేరుకునే అవకాశాలున్నాయి. కనీసం ఏ ఒక్క మ్యాచ్ లో ఓటమి పాలయినా ప్లేఆఫ్ కు చేరకుండానే ఇంటి దారి పట్టక తప్పదు. నిన్న ఈ సీజన్ లో రెండు పేలవ ప్రదర్శనలు చేసిన రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓటమి, గెలుపు కంటే అసలు దీనికి కారణాలు మాత్రం అన్వేషించడం లేదు. మొత్తం మీద చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఆరు పాయింట్లకు చేరుకుంది.
మరోసారి పేలవ ప్రదర్శన...
అయితే ఈ మ్యాచ్ లో ఓటమి పాలయిన చెన్నై సూపర్ కింగ్స్ కు మాత్రం ప్లే ఆఫ్ ఆశలు అడుగింటాయి. ప్లే ఆఫ్ నుంచి చెన్నై బయటకు వచ్చిందనే అనుకోవాలి. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ అతి దరిద్రమైన ప్రదర్శన చేసింది. రషీద్ తొలి బంతికే క్యాచ్ ఇచ్చి అవుటయి వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఆయుష్ మాత్రే మాత్రం పరవాలేదనిపించాడు. కాసేపు ఫోర్లు బాది ముప్ఫయి పరుగులు చేసి అవుటయ్యాడు. సామ్ కరన్ తొమ్మిది పరుగులు, జడేజీ 21 పరుగులు చేశారు. బ్రెవిస్ మాత్రం 42 పరుగులు చేశాడు. శివమ్ దూబె పన్నెండు పరుగులు చేసి నిష్క్రమించాడు. దీపక్ హుడా ఇరవై రెండు, మహేంద్ర సింగ్ ధోని ఆరు పరుగులు చేసి అవుట్ కావడంతో మరో బంతి మిగిలి ఉండగానే అంటే 19.5 ఓవర్లకే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ అవుట్ అయింది. కేవలం 154 పరుగులు మాత్రమే చేయగలిగింది.
స్వల్ప స్కోరు ఛేదనలో...
తర్వాత 155 స్వల్ప స్కోరు ఛేదనకు బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లో అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ కూడా 19 పరుగులకే నిష్క్రమించాడు. ఇషాన్ కిషన్ అత్యంత విలువైన 44 పరుగులు చేసి తన మీద వస్తున్న విమర్శలకు చెక్ చెప్పి అలా వెళ్లిపోయాడు. క్లాసెన్ కూడా విఫలమయి ఏడు పరుగులు మాత్రమే చేశాడు. అనికేత్ పందొమ్మిది పరుగులు చేశాడు. కమిందు నాటౌట్ గా నిలిచి పందొమ్మిది పరుగులు చేశాడు. దీంతో మొత్తం 18.4 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. చెన్నై పై విజయం సాధించింది. ఇంకా తాము ప్లే ఆఫ్ రేసులో ఉన్నామని చెప్పుకునేందుకు ఒక అవకామయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కు దక్కింది. కానీ మంచి ఫామ్ లో ఉన్న జట్లను ఢీకొని ప్లేఆఫ్ కు చేరుకునే దానిపై మాత్రం అనుమానాలున్నాయి.
Next Story

