Thu Jul 17 2025 00:41:43 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : అసలు మ్యాచ్ లో తేలిపోయిన పంజాబ్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుదే విజయం
చండీగఢ్ లో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ పై సునాయాస విజయం సాధించింది

ఐపీఎల్ 18వ సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో ఛాంపియన్స్ ఎవరన్నది తేలనుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం ఒక్క అడుగు దూరంలోనే కప్పుకు చేరువలో ఉంది. ఈసారి ఎలాగైనా కప్పు గెలుచుకోవడానికి జట్టు సమిష్టిగానే ప్రయత్నిస్తుంది. దీనికి తోడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు అదృష్టం కూడా అలాగే కలసి వస్తుంది ఇప్పటి వరకూ ఆడిన అన్ని మ్యాచ్ లలో కేవలం లక్కుతోనే కాదు.. బ్యాటు, బాల్ తోనూ పాయింట్లు సాధించి ఈ దశకు చేరుకుంది.దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్స్ కు వచ్చిన ఆర్సీబీ ఈసారి కప్పు గెలుచుకునే అవకాశాలు ఎంత ఉన్నాయన్నది పక్కన పెడితే ఆజట్టు శ్రమకు ఇది అందిన ఫలం అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి.
తడబడిన పంజాబ్...
నిన్న చండీగఢ్ లో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ పై సునాయాస విజయం సాధించింది. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే పంజాబ్ కింగ్స్ తేలిపోయింది. ఇప్పటి వరకూ పంజాబ్ కింగ్స్ అదరకొట్టే పెర్ ఫార్మెన్స్ తో వచ్చినప్పటికీ క్వాలిఫయిర్ 1 కు వచ్చేసరికి తడబడింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కు ఆది నుంచి కష్టాలు మొదలయ్యాయి. ప్రియాంశ్ ఆర్య ఏడు పరుగులకు అవుటయ్యాడు. ప్రభ్ సిమ్రన్ పద్దెనిమిది పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇంగ్లిస్ నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగాడు. శ్రేయస్ అయ్యర్ రెండు పరుగులకు ముగించాడు. స్టాయినిస్ 26 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ మూడు పరుగులకు వెనుదిరిగాడు. ముషీర్ ఖాన్, అజ్మతుల్లా వెంటవెంటనే అవుట్ కావడంతో పంజాబ్ కింగ్స్ కేవలం 14.1 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయి కేవలం 101 పరుగులు మాత్రమే చేయగలిగింది.
నింపాదిగా ఆడుతూ...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు యశ్ దయాళ్ రెండు, సుయశ్ శర్మ మూడు వికెట్లు తీయడంతో పంజాబ్ వెన్ను విరిచినట్లయింది. తర్వాత అతి స్వల్ప స్కోరు ఛేదన పెద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కష్టమేమీ కాలేదు. ఎందుకంటే తక్కువ లక్ష్యం. అందుకే బిందాస్ గా ఆడారు. సాల్ట్ 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కోహ్లి పన్నెండు పరుగులకు అవుటయినా, మయాంక్ అగర్వాల్ పందొమ్మిది పరుగులకు వెనుదిరిగాడు. రజిత్ పాటీదార్ పదిహేను, ముషీర్ ఖాన్ పందొమ్మిది పరుగులు చేయడంతో పంజాబ్ కింగ్స్ విధించిన లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేరుకుంది. కేవలం పది ఓవర్లలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ఫైనల్ కు దూసుకెళ్లింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2009, 2011, 2016లో ఫైనల్స్ కు చేరకుంది. తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు ఫైనల్స్ కు చేరుకున్నట్లయింది.
Next Story