Tue Aug 09 2022 23:14:47 GMT+0000 (Coordinated Universal Time)
కేఎల్ రాహుల్ కు శస్త్రచికిత్స పూర్తి

టీమిండియా క్రికెటర్, లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. రాహుల్ కు గజ్జ భాగంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించాల్సిన రాహుల్ ఉన్నట్టుండి గాయంతో తప్పుకున్నాడు. ''అందరికీ హెలో.. కొన్ని వారాల నుంచి కష్టంగా ఉంది. కానీ సర్జరీ విజయవంతమైంది. నా గాయం మానుతోంది. చక్కగా కోలుకుంటున్నాను. కోలుకునే క్రమం మొదలైంది. మీ సందేశాలకు, ప్రార్థనలకు ధన్యుడను. త్వరలోనే మీ అందరినీ చూస్తాను'' అంటూ సోషల్ మీడియాలో రాహుల్ పోస్ట్ పెట్టాడు. తాను ఆసుపత్రి బెడ్ పై నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేశాడు.
30 ఏళ్ల రాహుల్ గత ఎనిమిదేళ్లలో భారత్ తరఫున 42 టెస్టులు, 42 వన్డేలు, 56 టీ20లు ఆడాడు. రాహుల్ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, అతని పునరావాసాన్ని డాక్టర్ నితిన్ పటేల్ నేతృత్వంలోని NCA స్పోర్ట్స్ సైన్స్ బృందం పర్యవేక్షిస్తుంది. అతని పునరాగమనంపై కరెక్ట్ గా సమయం చెప్పడం కష్టం అయినప్పటికీ, రాహుల్ మళ్లీ ఇండియా జెర్సీని ధరించడానికి మరో రెండు నెలలు పట్టవచ్చని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.
"రాహుల్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాడు, ఆపై అతని పునరావాసం NCAలో ప్రారంభమవుతుంది. అతను తన రెగ్యులర్ నెట్ సెషన్ ను ప్రారంభించడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అతను ఆసియా కప్లో పునరాగమనం చేయగలడో లేదో చూద్దాం." అని బీసీసీఐకు చెందిన అధికారులు చెప్పుకొచ్చారు. రాహుల్ టీ20 ఫార్మాట్లో భారత్కు అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. ఆస్ట్రేలియాలో జరగబోయే T20 ప్రపంచ కప్లో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.
Next Story