Fri Dec 05 2025 15:54:30 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025: పాక్ దాడుల ఎఫెక్ట్.. ఢిల్లీ కాపిటల్స్... పంజాబ్ కింగ్స్ ఆట రద్దు
పాక్ - ఇండియా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో ఢిల్లీ కాపిటల్స్ తో పంజాంబ్ కింగ్స్ మ్యాచ్ రద్దయింది

ఐపీఎల్ 18 సీజన్ లో మ్యాచ్ లు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. వర్షం వల్ల కొన్ని మ్యాచ్ లు ఆగిపోతే.. ఇక తాజాగా పాక్ - ఇండియా మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మరొక ఆట ఆగింది. ధర్మశాలలో మ్యాచ్ ప్రారంభమయిన కొద్దిసేపటికే మ్యాచ్ ను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. పాకిస్తాన్ ఇండియాపై పలు చోట్ల దాడులకు తెగబడటంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మశాలలో ఢిల్లీ కాపిటల్స్ తో పంజాంబ్ కింగ్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. వర్షం పడిన కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయింది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 8.30 గంటలకు కానీ ప్రారంభం కాలేదు. అయితే టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
పాక్ దాడులతో...
కానీ పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు తెగపడుతుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా స్టేడియంలోని ఫ్లడ్ లైట్లను ఆపేశారు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను కూడా పంపించి వేశారు. దాదాపు పద్దెనిమిది వేల మంది ప్రేక్షకులు వెళ్లిపోయారు. ఫ్లడ్ లైట్లు ఆరిపోగానే సాంకేతిక కారణాలని అనుకున్నారు. కానీ పాక్ - ఇండియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆపేశారని తెలుసుకుని ప్లేయర్లు కూడా ఆశ్చర్యపోయారు. అప్పటికే ఆట ప్రారంభమైంది. సగం పూర్తయింది. పంజాబ్ కింగ్స్ 10.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి 122 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆటను నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పంజాబ్ కింగ్స్ తో ఢిల్లీ కాపిటల్స్ మ్యాచ్ ధర్మశాలలో అర్థాంతరంగా నిలిచిపోయింది.
భద్రత దృష్ట్యా...
ఆటగాళ్ల భద్రత దృష్ట్యా మ్యాచ్ ను నిలిపేశామని తర్వాత నిర్వాహకులు ప్రకటించారు. నిన్న ఇండియాలోని పలు చోట్ల పాక్ దాడులకు తెగబడింది. దీంతో వాయు మార్గంలో దాడులు జరిగే అవకాశముందని అనుమానించిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆటను అర్ధాంతరంగా నిలిపేశారు. ఆటగాళ్లను సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా ధర్మశాలలో విమానాశ్రయాన్ని మూసివేయడంతో ప్రత్యేక రైలులో వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. కానీ ఈ మ్యాచ్ రద్దయిన తర్వాత పాయింట్లు కేటయించకపోవడంతో మళ్లీ మ్యాచ్ నిర్వహిస్తారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై బీసీసీఐ ప్రకటన అధికారికంగా చేయాల్సి ఉంది.
Next Story

