Fri Dec 05 2025 13:02:08 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : ముంబయి ఇండియన్స్ కు చేదు అనుభవం... పంజాబ్ కింగ్స్ దే విజయం
జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ముంబయి ఇండియన్స్ ఓడించి నేరుగా క్వాలిఫయిర్ ఆడే అవకాశాన్ని దక్కించుకుంది.

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి దూసుకు పోతుంది. ఎక్కడా తగ్గకుండా విజయాలను సొంతం చేసుకుంటూ వస్తుంది. ప్లేఆఫ్ రేసుకు చేరుకోవడమే కాకుండా తాజాగా క్వాలిఫయిర్ ఆడే అవకాశాన్ని కూడా పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఐపీఎల్ లో ఇప్పటి వరకూ ఆడింది వేరు. ఇక ఆట వేరు. ఎందుకంటే ప్లేఆఫ్ రేసులో చేరిన జట్లు తలపడనున్నాయి. దీంతో ఇకపై జరగబోయే మ్యాచ్ లన్నీ రంజుగా సాగనున్నాయి. నిన్న జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ముంబయి ఇండియన్స్ ఓడించి నేరుగా క్వాలిఫయిర్ ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో ఓటమి పాలయిన ముంబయి ఇండియన్స్ ఎలిమినేటర్ లో ఆడాల్సి వస్తుంది.
ధాటిగా ఆరంభించినా...
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ ఆరంభంలో కొద్దిగా ధాటిగా ఆడినప్పటికీ తర్వాత క్రమంగా ఇబ్బంది పడింది. రికిల్ టన్ 27 పరుగులు చేసి అవుటయ్యాడు. రోహిత్ శర్మ ఇరవై నాలుగు పరుగుల వద్ద అవుటయ్యాడు. సూర్యకుమార్ ఈ సీజన్ లో బాగా ఆడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ లోనూ యాభై ఏడు పరుగులు చేశాడు. తిలక్ వర్మ ఒక పరుగుకే వెనుదిరిగాడు. జాక్స్ పదిహేడు పరుగులుకు పెవిలియన్ బాట పట్టాడు. హార్ధిక్ పాండ్యా ఇరవై పరుగులు చేసి మ..మ అనిపించాడు. నమన్ ఇరవై పరుగులు చేయడంతో ముంబయి ఇండియన్స్ మొత్తం ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పెద్ద లక్ష్యమేమీ కాకపోవడంతో...
185 పరుగులు లక్ష్యమంటే పెద్దదేమీ కాదు. అందులో మంచి ఫామ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ ముందు ఈ లక్ష్యం చిన్నదేనని అందరికి తెలుసు. అయినా ముంబయి ఇండియన్స్ బౌలర్లు ఏదైనా మ్యాజిక్ చేస్తారేమోనని అందరూ ఎదురు చూశారు. కానీ కుదరలేదు. ఓపెనర్లుగా దిగిన ప్రియాంశ ఆర్య 62 పరుగులు చేసి జట్టుకు ఊపు అందించాడు. తర్వాత ప్రభ్ సిమ్రన్ పదమూడు పరగులకు అవుటయినప్పటికీ ఇంగ్లిస్ మాత్రం నిలబడి మ్యాచ్ ను తమ వైపునకు తిప్పుకున్నాడు. ఇంగ్లిస్ 73 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వధేరా నాటౌట్ గా నిలిచి రెండు పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే సాధించింది. మూడు వికెట్లను మాత్రమే కోల్పోయింది. 187 పరుగులు చేసి నేరుగా క్వాలిఫయిర్ కు చేరుకుంది. ఏడు వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
Next Story

