Fri Dec 05 2025 11:27:15 GMT+0000 (Coordinated Universal Time)
Asia Games : కాసులే ముఖ్యమా? కయ్యం కంటే గేమ్స్ అవసరమా?
బీసీసీఐ నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఆసియా కప్ లో పాల్గొనాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుపడుతూ పోస్టింగ్ లు పెడుతున్నారు

బీసీసీఐ నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఆసియా కప్ లో పాల్గొనాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుపడుతూ పోస్టింగ్ లు పెడుతున్నారు. బీసీసీఐ నిర్ణయాన్ని ఏకి పారేస్తున్నారు. ఒకవైపు పాకిస్తాన్ తో కయ్యం జరుగుతుంటే మరొకవైపు పాక్ తో ఆటలా? అంటూ క్రీడాభిమానులు మండిపడుతున్నారు. పహాల్గామ్ దాడి వేడి చల్లారకముందే పాకిస్తాన్ తో ఆడేందుకు సిద్ధమయియన బీసీసీఐ నిర్ణయాన్ని చాలా మంది తప్పుపడుతూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండు దేశాల మధ్య జరిగే ఆట పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు లాభం తెచ్చి పెడుతుందని, అది భారత్ మీదకు ఉపయోగించేందుకు పాక్ వెచ్చిస్తుందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
మోదీ ఇలా అంటున్నా...
ఒకవైపు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రధాని మోదీ చెబుతున్నారు. మరొకవైపు నీళ్లు, రక్తం కలసి ప్రవహించవని అంటున్న సమయంలో బీసీసీఐ ఆసియా కప్ కు జట్టును ప్రకటించడం వివాదంగా మారింది. పాక్ - భారత్ మ్యాచ్ అంటే అందరికీ టెన్షన్. ఉత్కంఠ భరితమైన ఈ మ్యాచ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కాసుల వర్షం కురిపిస్తుంది. మిగిలిన మ్యాచ్ లతో ఆడేటప్పుడు కంటే భారత్ తో మ్యాచ్ లకే ఎక్కువ వ్యూయర్ షిప్ ఉంటుంది. పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కు కూడా లాభం చేకూరుతుంది. అలాంటిది ఇలాంటి సమయంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న సమయంలో పాకిస్తాన్ తో ఎలా ఆడతారని భారత్ లోని పలువురు క్రీడాభిమానులు, సీనియర్ ఆటగాళ్లు ప్రశ్నిస్తున్నారు.
డబ్బే ముఖ్యమా?
బీసీసీఐకి డబ్బే ముఖ్యమా? అని ప్రశ్నిస్తున్నారు. వచ్చే నెల14వ తేదీన పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ ఆసియా కప్ లో ఆడనుంది. ఒకవైపు ఉగ్రవాదులు దేశంలో చొరబడి తమపై దాడులు చేస్తుంటే, ఆ దేశ సైనికాధ్యక్షులు కూడా భారత్ పై విషం గక్కుతుంటే వీరికి మాటల కంటే ఆటలు ముఖ్యమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. భారత్ జట్టు పాక్ తో ఆడకూడదని చాలా మంది కోరుకుంటున్నారు. ఉగ్రవాదంతో కలసి ఆటలు సాగవని పాక్ కు తెలియజేయాలని గట్టిగా డిమాండ్ వినిపిస్తుంది. దేశం కన్నా క్రికెట్ ముఖ్యమా? అని నిలదీస్తున్నారు. మతం పేరు అడిగి మరీ చంపుతున్న ఉగ్రవాదులకు అండగా నిలబడిన దేశంతో ఆటలేంటి? అంటూ విరుచుకుపడుతున్నారు. భారత ప్రజల మనోభావాలను గాయపర్చవద్దంటూ సోషల్ మీడియలో పోస్టులు పెడుతున్నారు. బాయ్ కాట్ అంటూ పిలుపునిస్తున్నారు.అయితే గేమ్ ను గేమ్ గా చూడాలని, దానికి, సెంటిమెంట్ కు ముడిపెట్టకూడదని పలువురు వాదిస్తున్నారు.
Next Story

