Thu Jan 15 2026 04:27:55 GMT+0000 (Coordinated Universal Time)
India vs Newzealand : భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం... సిరీస్ సమంగా
రాజ్ కోట్ లో భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డే లో న్యూజిలాండ్ విజయం సాధించింది

రాజ్ కోట్ లో అనుకున్నట్లే జరిగింది. భారత్ కు ఘోర పరాజయం పాలయింది. భారత్ కు వరస ఓటమి అందించిన రాజ్ కోట్ మైదానం ఈసారి కూడా కరుణించలేదు. రాజ్ కోట్ లో భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డే లో న్యూజిలాండ్ విజయం సాధించింది. మరొక ఏడు వికెట్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుని సిరీస్ ను సమం చేసింది. మూడు వన్డే ల మ్యాచ్ లలో భారత్ - న్యూజిలాండ్ లు 1-1 సమంగా స్కోరు చేశాయి. ఛేజింగ్ లో న్యూజిలాండ్ ఏ మాత్రం బెదరలేదు. భారత్ చేసిన అనేక తప్పిదాలు న్యూజిలాండ్ కు కలసి వచ్చాయి. అనేక సార్లు క్యాచ్ లు జార విడవటం కవీస్ కు కలసి వచ్చినట్లయింది.
తొలుత బ్యాటింగ్ చేసి...
టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేకపోయారు. రోహిత్ శర్మ ఇరవై నాలుగు పరుగులకే అవుటయ్యాడు.విరాట్ కోహ్లి 23 పరుగులకే వెనుదిరిగాడు. శుభమన్ గిల్ మాత్రం రెండో వన్డేలోనూ హాఫ్ సెంచరీ చేశాడు. యాభై ఆరు పరుగులు చేశాడు.శ్రేయస్ అయ్యర్ ఎనిమిది పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత కేఎల్ రాహుల్ ఒక్కడే శతకం బాదాడు. కేఎల్ రాహుల్ 112 పరుగులు చేయడంతో మొత్తం యాభై ఓవర్లకు గాను భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 284 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆదిలో కొంత ఇబ్బంది పడింది. వెంటవెంటనే రెండు వికెట్లు పడటంతో భారత్ కు అనుకూలంగా ఉందని అనుకున్నారు.
అలవోకగా లక్ష్యాన్ని సాధించి...
మందకొడిగా సాగే పిచ్ కావడంతో ఆ స్కోరు చేయడం కష్టమేనని అందరూ అనుకున్నారు. కానీ కాన్వే పదహారు పరుగులకే వెనుదిరిగాడు. నికోల్స్ 10 పరుగులకు అవుటయ్యాడు. ఆ దశలో భారత్ ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి సిరీస్ నెగ్గుతుందని అనుకున్నారు. కానీ మిచెల్ నాటౌట్ గా నిలిచి 131 పరుగులు చేశాడు. మిచెల్ కు అండగా యంగ్ కూడా ఉండి 87 పరుగులు చేశాడు. యంగ్ అవుట్ అయిన తర్వాత కూడా ఫిలిప్స్ 32 పరుగులు చేశాడు. కేవలం 47.3 ఓవర్లలోనే భారత్ విధించిన లక్ష్యాన్ని న్యూజిలాండ్ అధిగమించింది. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కులదీప్ లు తలో వికెట్ మాత్రమే తీయగలిగారు. ఆదివారం జరిగే మూడో వన్డేలో సిరీస్ ఎవరన్నది తేలనుంది.
Next Story

