Tue Jul 08 2025 17:07:56 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : ముంబయి దెబ్బకు గుజరాత్ గజగజ..టైటాన్స్ ఇంటికి.. ఇండియన్స్ ముందుకు
ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ ను ఓడించి, ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకోవడానికి ఇక రెండడుగుల దూరంలో నిలిచింది.

ముంబయి ఇండియన్స్ పడి లేచిన కెరటంలా ఐపీఎల్ లో దూసుకు వస్తుంది. ముంబయి ఇండియన్స్ సీజన్ ఆరంభంలో ఓటములతో ప్రారంభించినప్పుడు జట్టు యాజమాన్యం నీతూ అంబానీ సయితం ఈసారి ప్లేఆఫ్ రేసుకు కూడా కష్టమని భావించి ఉంటారు. అలాంటి జట్టు అన్ని కష్టాలను అధిగమించి చివరకు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఛాంపియన్ షిప్ కు దగ్గరవుతుంది. ముంబయి ఇండియన్స్ లో బుమ్రా తో పాటు మరికొందరు చేరిక తర్వాత టీం మరింత పటిష్టంగా మారింది. తాజాగా చండీగఢ్ లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ ను ఓడించి, ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకోవడానికి ఇక రెండడుగుల దూరంలో నిలిచింది.
ధాటిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించి...
తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ ధాటిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. రికిల్ టన్ లేకపోయినా, జాక్స్ జట్టును విడిచి వెళ్లిపోయినా ఆ జట్టులో పట్టు సడలలేదు. రోహిత్ శర్మ కరెక్ట్ సమయానికి ఫామ్ లోకి వచ్చేశాడు. రోహిత్ శర్మ వీర బాదుడుతో రన్ రేటు అమాంతం పెరిగిపోయింది. రోహిత్ శర్మ 81 పరుగులు చేసి అవుటయ్యాడు. బెయిర్ స్టో 47 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 33 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. తిలక్ వర్మ ఇరవై ఐదు పరుగులు, హార్థిక్ పాండ్యా ఇరవై రెండు పరుగులు చేసి జట్టుకు అత్యధిక స్కోరును సంపాదించి పెట్టారు. ముంబయి ఇండియన్స్ మొత్తం ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 228 పరుగులు చేయగలిగింది.
భారీ లక్ష్యాన్ని అధిగమించడంలో...
గుజరాత్ టైటాన్స్ కు ఈ స్కోరు అధిగమించడం పెద్ద కష్టమేమీ కాకపోయినా, ఆ జట్టు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ పటిష్టంగా లేకపోవడంతో కొంత అనుమానాలు ముందుగానే బయలుదేరాయి. భారీ లక్ష్యాన్ని అధిగమించే పరిస్థితుల్లో కెప్టెన్ శుభమన్ గిల్ ముఖ్యమైన మ్యాచ్ లో ఒక పరుగుకే అవుటయ్యాడు. ఇక సాయి సుదర్శన్ మాత్రం ఎప్పటి లాగానే ఆడి ఎనభై పరుగులు చేశాడు. కుశాల్ హిట్ వికెట్ అయి ఇరవై పరుగులు చేసి వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ 48 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. మిగిలిన బ్యాటర్లు ఎవరూ నిలకడగా రాణించలేకపోవడంతో గుజరాత్ టైటాన్స్ ఓటమి కొని తెచ్చుకుంది. ఇరవై ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ టైటాన్స్ 28 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ లో ఓడి ఇంటి దారి పట్టగా, ముంబయి ఇండియన్స్ ఛాంపియన్ షిప్ కు చేరువగా నిలిచింది.
Next Story