Fri Dec 05 2025 14:20:21 GMT+0000 (Coordinated Universal Time)
Ind Vs Eng Third Test : గెలుపు ఊరిస్తుంది.. ఓటమీ తలుపుతడుతుందేమో?
లార్డ్స్ లో జరుగుున్న ఇండియా - ఇంగ్లండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో గెలుపు ఊరిస్తుంది.

లార్డ్స్ లో జరుగుున్న ఇండియా - ఇంగ్లండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో గెలుపు ఊరిస్తుంది. గెలుపు ఎవరికైనా సాధ్యమే. ఇటు ఇండియా, అటు ఇంగ్లండ్ గెలుపు కోసం పోరాడుతున్నాయి. కావాల్సినంత సమయం ఉంది. ఈరోజు ఆఖరు రోజు కావడంతో ఈరోజు ఇంగ్లండ్ విధించిన లక్ష్యాన్ని అధిగమించగలిగితే ఇండియాకు ఈ సిరీస్ లో రెండో గెలుపు సాధ్యమయినట్లే. అయితే ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయిన టీం ఇండియా కొంత కష్టాల్లోనే ఉంది. యాభై ఎనిమిది పరుగులకే రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఎవరైనా ఇద్దరు ముగ్గురు భారత ఆటగాళ్లు నిలబడి ఆడగలిగితే మాత్రం విజయం ఖచ్చితంగా ఇండియాను వరిస్తుంది.
ఛేదన కష్టమే...
కానీ ఛేదన అంత సులువు కాదనిపిస్తుంది. భారత్ ఇండియా విజయం సాధించాలంటే మరో 135 పరుగులు మాత్రమే చేయాలి. ఈరోజు మొత్తం సమయం ఉంది. నిదానంగా ఆడుతూ ఓవర్ కు మూడు పరుగులు సింగిల్స్ తీసినా విజయం ఖచ్చితంగా వరిస్తుంది. అయితే 135 పరుగులు చేయడం మాటలు కాదన్న విషయం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 387 పరుగులు చేసి ఆల్ అవుట్ అయితే ఇండియా కూడా తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులు చేసి ఆల్ అవుట్ అయి స్కోరును సమం చేసింది.
తక్కువ పరుగులకే అవుట్ చేసి...
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులు చేయగలిగింది. బుమ్రా రెండు, సిరాజ్ రెండు, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ ఒకటి, వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయడంతో భారత్ తక్కువ పరుగులకే ఇంగ్లండ్ ను ఆల్ అవుట్ చేయగలిగింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో భారత్ తడబడుతూ ప్రారంభించింది. జైశ్వాల్ డకౌట్ అయ్యాడు. కెఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ 33 పరుగులు చేశాడు. కెఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రాహుల్ ఉండటంతో ఇండియాకు కొంత ఊరట కలిగించే అంశం. కరుణ్ నాయర్ పథ్నాలుగు పరుగులకే అవుట్ కాగా, గిల్ ఆరు పరుగులకే వెనుదిగాడు. ఆకాశ్ దీప్ ఒక పరుగుకు అవుట్ కావడంతో 58 పరుగులకే నాలుగు వికెట్లను ఇండియా కోల్పోయింది. ఈరోజు మిగిలిన ఆటగాళ్ల ప్రదర్శన పై మన గెలుపోటములు ఆధారపడి ఉంటాయని చెప్పకతప్పదు.
Next Story

