Wed Feb 25 2026 13:32:46 GMT+0530 (India Standard Time)
T20 World Cup : భారత్ కు టాప్ ఆర్డర్ వైఫల్య కష్టాలు.. రేపు అధిగమించేనా?
టీ 20 వరల్డ్ కప్ లో రేపు భారత్ - జింబాబ్వే తలపడనున్నాయి

టీ 20 వరల్డ్ కప్ లో రేపు భారత్ - జింబాబ్వే తలపడనున్నాయి. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు భారత్ సిద్ధమవుతోంది. జింబాబ్వేతో జరిగే ఈ పోరులో టాప్ ఆర్డర్ అస్థిరత మళ్లీ చర్చకు వచ్చింది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మలతో ఎడమచేతి బ్యాటర్లనే ముందుకు పంపిన భారత్‌కు వేగంగా ఆరంభం దక్కడం లేదు. ఆఫ్ స్పిన్‌తో వారిని కట్టడి చేసే ప్రత్యర్థుల వ్యూహం స్పష్టంగా పనిచేస్తోంది. అభిషేక్ శర్మ వరస వైఫల్యాలు భారత్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో చెన్నై వేదికగా రేపు జరగనున్న మ్యాచ్ లో కొన్ని మార్పులుంటాయని అంటున్నారు. రింకూ సింగ్ స్థానంలో సంజూ శాంసన్ ను ఎంపిక చేసే అవకాశముందని చెబుతున్నారు.
మళ్లీ వారిద్దరే...
ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ జోడీని కొనసాగిస్తే జింబాబ్వే కూడా అదే మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లు సికిందర్ రాజా లేదా బ్రెన్ బెన్నెట్ బౌలింగ్‌ను ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లో ఈ జోడీ ఓపెనింగ్‌కు వచ్చిన ప్రతిసారి పవర్‌ప్లేలో భారత్ పెద్ద స్కోరు చేయలేకపోయింది. ఆరు ఓవర్లలో గరిష్ఠంగా 52 పరుగులే చేసింది. అంతేకాదు, నాలుగు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ శర్మ ఓపెనర్ డక్ అయ్యాడు. లీగ్ దశలో మధ్యతరగతి బ్యాటర్లు జట్టును గట్టెక్కించారు. కానీ దక్షిణాఫ్రికా పై మ్యాచ్‌లో టీం ఇండియా బలహీనతలు మరోసారి బహిర్గతమయ్యాయి. భారీ ఓటమితో ఆ లోపాలు మరింత స్పష్టమయ్యాయి.
ఓపెనర్ల వైఫల్యం...
ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో అమెరికాపై అభిషేక్ తొలి బంతికే అవుట్ కావడంతో భారత్ పవర్‌ప్లేలోనే నలభై ఆరు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే అప్పుడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ జట్టును గెలిపించారు. పాకిస్తాన్ పై యాభై రెండు పరుగులకు ఒక వికెట్, నెదర్లాండ్స్ పై యాభై ఒక్క పరుగుకు రెండు, దక్షిణాఫ్రికాపై ముప్ఫయి ఒక్క పరుగులకు రెండు వికెట్లు కోల్పోవడంతో టాప్ ఆర్డర్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. నమీబియా మ్యాచ్‌లో మాత్రమే పవర్‌ప్లేలో ఒత్తిడి కనిపించలేదు. ఆ మ్యాచ్‌లో సంజూ శాంసన్, ఇషాన్ కలిసి ఓపెనింగ్ చేశారు. న్యూఢిల్లీ మ్యాచ్‌లో అభిషేక్ లేకపోవడంతో సంజూ ఎనిమిది బంతుల్లో 22 పరుగులు చేశాడు. మూడు సిక్సర్లతో జట్టుకు వేగవంతమైన ఆరంభం ఇచ్చాడు. ఆరు ఓవర్లలో భారత్ ఒక వికెట్ కోల్పోయి ఎనభై ఐదు పరుగుులు చేసింది. ఈ టోర్నీలో అది అత్యధిక పవర్‌ప్లే స్కోరు.
రింకూ సింగ్ స్థానంలో...
గత ఏడాది మొత్తం 777 పరుగులు చేసి సగటు 33.78 నమోదు చేసిన అభిషేక్ శర్మ, ఇటీవల నాలుగు ఇన్నింగ్స్‌లో కేవలం 15 పరుగులే చేశాడు. గత ఎనిమిది ఇన్నింగ్స్‌లో ఐదు సార్లు డక్ అయ్యాడు. తిలక్ వర్మ ఈ ప్రపంచకప్‌లో 21.4 సగటుతో, 118.88 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. ఎనిమిదో స్థానంలో దిగుతున్న రింకూ సింగ్ 24 పరుగులకే పరిమితమయ్యాడు. అతని స్ట్రైక్‌రేట్ 83 మాత్రమే. టాప్ ఆర్డర్లో ఎడమచేతి బ్యాటర్ల వరుసను విరమించేందుకు సంజూను మళ్లీ పిలిచే ఆలోచన జట్టు యాజమాన్యంలో ఉంది. ఆదివారం ఓటమి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్ ఏ మార్పులు చేస్తుందో ఆసక్తిగా మారింది. మొత్తం మీద రేపు జరగనున్న మ్యాచ్ భారత్ కు కీలకం కావడంతో సంజూ శాంసన్ ఎంపిక అనివార్యమంటున్నారు. రింకూసింగ్ కూడా తండ్రి ఆరోగ్యం బాగా లేక వెళ్లిపోయారని వార్తలు వస్తుండటంతో సంజూ ఎంపిక అనివార్యమైందంటున్నారు.
Next Story

