Mon Feb 16 2026 11:53:06 GMT+0530 (India Standard Time)
India vs Pak : భారత్ దెబ్బకు పాక్ కు కాళరాత్రి.. 61 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ
కొలంబోలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది

ఎవరన్నారు.. హై ఓల్టేజీ మ్యాచ్ అని.. నమీబియా.. అమెరికా టెన్షన్ పెట్టిన దాంట్లో రవ్వంత కూడా పాక్ భారత్ ను ఏ మాత్రం భయపెట్టలేకపోయింది. ఓయ్.. తారిఖ్ అన్వరూ.. నువ్వు ఆగి.. ఆగి బంతి వేస్తే.. మావోళ్లు ఎగిరెగిరి దంచుతారు. తెలిసిందా... భారత్ సత్తా.. ఇండియాతో ఆడేముందు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.. ఇవీ భారత్ - పాక్ మ్యాచ్ ముగిసిన తర్వాత నెట్టింట కనిపించిన కామెంట్స్. టీ20 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ పై సునాయాసంగా విజయం సాధించింది. ఏ మాత్రం టెన్షన్ లేదు. ఊరికే ఊదిపారేశారంతే.. ఇంకా రెండు క్యాచ్ లు మిస్ అయ్యాయి కానీ.. ఇషాన్ కిషన్, కులదీప్ వాటిని క్యాచ్ చేసి ఉంటే పాక్ వంద లోపు ఆల్ అవుట్ అయి బిక్కమొహం వేసేది. దటీజ్ ఇండియా
టెన్షన్ లేని మ్యాచ్...
కొలంబోలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. అభిషేక్ శర్మ వెంటనే అవుటయినా ఇషాన్ కిషన్ మరోసారి తన సత్తా చాటాడు. దూకుడుతో ఆడుతూ భారత్ కు పరుగులు తెచ్చిపెట్టాడు. ఇక తర్వాత హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రాఅద్భుత బౌలింగ్‌తో పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఫలితంతో భారత్ సూపర్–8 దశకు చేరుకుంది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 175 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ తక్కువ పరుగులకే బ్యాటింగ్ చేసిందని భావించినా తర్వాత మన బౌలర్లు చెడుగుడు ఆడారు. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో భారత్ ఆధిక్యం 8–1గా నిలిచింది.
ఇషాన్ దూకుడు...
టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ నెమ్మదిగా ఉన్నా ఇషాన్ 40 బంతుల్లో 77 పరుగులతో జట్టును గట్టెక్కించాడు. పవర్, టైమింగ్ కలగలిపి పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అభిషేక్ శర్మ తొలిఓవర్లోనే ఔటైనా ఇషాన్ దూకుడు ఆపలేదు. తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తిలక్ 25 పరుగులు చేశాడు. షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో పుల్ షాట్‌తో ప్రారంభించిన ఇషాన్, అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్‌లపై సిక్సర్లు బాదాడు. కేవలం 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. చివరకు అయూబ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు.తర్వాత తిలక్, హార్దిక్ పాండ్యా వరుస బంతుల్లో ఔటయ్యారు. 126కు రెండు వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి భారత్ 126 పరుగులకే నాలుగు వికెట్లు పడిపోయింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), శివమ్ దూబే (27) కలిసి జట్టును 150 దాటించారు. చివరి ఓవర్లో అఫ్రిదీపై 15 పరుగులు సాధించడంతో భారత్ 175కు చేరింది.
లక్ష్య ఛేదనలో...
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా తొలి ఓవర్లో ఫర్హాన్‌ను ఔట్ చేశాడు. ఆ వెంటనే బుమ్రా దూసుకొచ్చాడు. సాయిం అయూబ్‌ను యార్కర్‌తో ఎల్బీడబ్ల్యూ చేశాడు. సల్మాన్ అలీ ఆఘాను మిడ్వికెట్లో క్యాచ్ ఇవ్వించాడు. పదమూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. బాబర్ ఆజమ్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. పవర్‌ప్లేలోనే 38 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఓవర్లలో కుల్దీప్ యాదవ్, అక్షర్, తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పాకిస్థాన్ పోరాటం చేయలేకపోయింది. బుమ్రా, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీయగా, కులదీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ తీసి పాక్ పతనాన్ని శాసించారు. అంతే.. మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది.
Next Story

