Fri Dec 05 2025 12:23:31 GMT+0000 (Coordinated Universal Time)
India vs Pakistan: ఆ భయం అందరికీ ఉంది

భారతజట్టు ICC ట్రోఫీని గెలుపొంది దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతోంది. ఈసారైనా టీ20 ప్రపంచ కప్ ను గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. భారత్ మొదటి T20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్ లో పాకిస్తాన్తో తలపడనుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు బాబర్ ఆజం జట్టుతో తలపడనుంది. టిక్కెట్లు మొత్తం బుక్ అయిపోవడంతో మ్యాచ్కు భారీ సంఖ్యలో ఇరు దేశాల అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.
అక్టోబర్ 23, ఆదివారం సాయంత్రం సమయంలో ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డుగా ఉన్నాడు. మెల్బోర్న్ వాతావరణం గురించి నిపుణులు చెబుతున్న ప్రకారం నేడు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. మెల్బోర్న్లో ఈ రోజు వర్షం కురిసే అవకాశం ఉందని, సాయంత్రం సమయంలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగవచ్చని చెబుతూ ఉన్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఇదే విషయం గురించి అడిగారు. మొత్తం 40 ఓవర్లు ఆడాలనే మనస్తత్వంతో భారత్ మ్యాచ్ కు వస్తుందని శర్మ చెప్పాడు. "మెల్ బోర్న్ లోని భవనాలపై నల్లటి మేఘాలు ఉదయాన కనిపించాయి.. ఇప్పుడు ఎండ ఉంది. మేము 40 ఓవర్ల ఆటగా భావించి మ్యాచ్లోకి వస్తాము. ఇటీవల ఆస్ట్రేలియాతో 8 ఓవర్ల గేమ్ ఆడాము.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలతో ముందుకు వస్తాము.. ఎన్ని ఓవర్ల మ్యాచ్ వీలైతే అందుకు తగ్గట్టు టీమ్ కూడా ఉంటుంది" అని శర్మ చెప్పాడు. ఆదివారం మెల్బోర్న్లో వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ నుండి వచ్చిన డేటా స్పష్టంగా సూచిస్తుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించే అంశమే..! మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగితే ఓవర్లలో కోత విధించి మ్యాచ్ను నిర్వహించే అవకాశం ఉంది. కనీసం 5 ఓవర్ల మ్యాచైనా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కుతుంది. ఈ మ్యాచ్కు రిజర్వ్డే లేదు.
Next Story

