Thu Feb 12 2026 10:43:11 GMT+0530 (India Standard Time)
T20 World Cup : నేడు భారత్ - నమీబియా మ్యాచ్.. ప్రయోగాలు చేయొద్దండి
టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్ నమీబియాతో ఆడనుంది.

టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్ నమీబియాతో ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. టీం ఇండియా అమెరికాపై గెలిచి మంచి ఊపు మీదుంది. అయితే అమెరికాపై సునాయాస విజయం అయితే లభించలేదు. ఇక నమీబియా టీంను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదన్నది విశ్లేషకుల అంచనా. క్రికెట్ లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చని, అందుకే ఆచితూచి ఆడాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. నమీబియా జట్టుపై గెలుపు తేలికే కావచ్చు. పసికూనపై గెలుపుతో నిర్లక్ష్యం ఉండకూదంటున్నారు.
శర్మ రాకుంటే..శాంసన్...
అయితే టీం ఇండియాలో ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడతాడా? లేదా? అన్న సందేహాలున్నాయి. ఢిల్లీలో ప్రాక్టీస్ కు రాకపోవడంతో అభిషేక్ శర్మ ఇంకా అనారోగ్యం నుంచి కోలుకోలేదన్న వార్తలు వస్తున్నాయి. అయితే అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఆడతాడని కొందరు చెబుతున్నారు. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో దారుణంగా విఫలమయిన అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశముందని చెబుతున్నారు. ఇషాన్ కిషన్ తో కలసి సంజూ శాంసన్ ఓపెనర్లుగా వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం.
గుడ్ న్యూస్ ఏంటంటే...
అయితే టీం ఇండియాకు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే.. పేసర్ జస్ప్రిత్ బుమ్రా నమీబియాతో జరిగే మ్యాచ్ కు అందుబాటులోకి రానున్నారు. సిరాజ్ స్థానంలో బుమ్రా ఆడనున్నాడు. పాక్ తో జరిగే మ్యాచ్ ప్రాక్టీస్ కోసమైనా బుమ్రాను ఈ మ్యాచ్ లోకి దించుతారని అంటున్నారు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా తిరిగి జట్టులోకి రావడం శుభపరిణామమే. ఇక నమీబియాతో జరిగే మ్యాచ్ లో భారత్ ప్రయోగాలకు సిద్ధమవుతుందా? లేక ఈ నెల 15వ తేదీన జరిగే పాక్ మ్యాచ్ కోసం ఆటగాళ్లకు ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్ ను ఉపయోగించుకుంటుందా? అన్నది చూడాలి.
Next Story

