Mon Mar 09 2026 11:08:38 GMT+0530 (India Standard Time)
T20 World Cup Finals : ఈ బ్యాట్ మాదే.. ఈ బంతి మాదే..గెలుపు మాదే
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ చరిత్ర సృష్టించింది.

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన తుది పోరులో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్‌ను కాపాడుకుంది. లక్షకు పైగా ప్రేక్షకుల హర్షధ్వనాల మధ్య భారత్ అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసింది. అయితే సెమీ ఫైనల్స్ లో లా టెన్షన్ కనిపించలేదు. బంతి.. బ్యాట్ రెండు భారత్ కు అనుకూలంగా మారాయి. బాల్, బ్యాట్ చేసిన విన్యాసంతో న్యూజిలాండ్ చతికలపడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడం చివరికి భారీ తప్పిదంగా మారింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కివీస్ ప్రారంభంలోనే తడబడ్డాయి. ఐదో ఓవరుకు మూడు వికెట్లు కోల్పోయి 43 పరుగులకే పరిమితమయ్యాయి.
ముగ్గురు అర్థశతకాలు...
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ మెరుపు ఆరంభం ఇచ్చారు. పవర్‌ప్లేలో వికెట్ కోల్పోకుండా 92 పరుగులు చేశారు. తొలి ఓవర్ల నుంచే కివీస్ బౌలర్లపై దాడి ప్రారంభించారు. అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. అయితే రాచిన్ రవీంద్ర బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి భారత్ 7.1 ఓవర్లలో 98 పరుగులకు ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. సంజూ శాంసన్ అద్భుత స్ట్రోక్‌ప్లే తో ఆకట్టుకున్నాడు. 33 బంతుల్లో అర్ధశతకం సాధించి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇషాన్ కిషన్ కూడా వేగంగా ఆడుతూ 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
భారీ స్కోరు చేయడతో....
12వ ఓవరులో భారత్ 150 పరుగుల మార్క్ చేరుకుంది. ఆ తర్వాత కూడా రన్స్ ప్రవాహం కొనసాగింది. 14వ ఓవరులో రవీంద్రపై సామ్సన్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. అయితే 16వ ఓవరులో జిమ్మీ నీషమ్ మూడు వికెట్లు తీసి మ్యాచ్‌లో కొంత ఉత్కంఠ తీసుకొచ్చాడు. సంజు సామ్సన్ (89), ఇషాన్ కిషన్ (54), సూర్యకుమార్ యాదవ్ డక్‌గా అవుట్ అయ్యారు.చివర్లో శివమ్ దూబే కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేసి జట్టుకు ఊపునిచ్చాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత్ ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయింది. అయితే ఎక్కడో అనుమానం. న్యూజిలాండ్ ఈ టార్గెట్ ఛేదిస్తుందా? అన్నది కొంత కలవరం కలిగించినా వెంటనే తుడిచిపెట్టుకుపోయింది.
బౌలర్ల అద్భుత ప్రదర్శన...
స్పిన్నర్ అక్షర్ పటేల్ ఫిన్ అలెన్‌ను బౌండరీ వద్ద క్యాచ్ అవుట్ చేయించాడు. ఆ తర్వాత జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో రాచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్ కిషన్ అద్భుతంగా అందుకున్నాడు. మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన అక్షర్ ప్రమాదకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి న్యూజిలాండ్ 52 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. టీమ్ సీఫర్ట్ మాత్రం దూకుడుగా ఆడుతూ 26 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అయినా మిగతా బ్యాటర్లు ఒత్తిడిని తట్టుకోలేక వరుసగా అవుట్ అయ్యారు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మార్క్ చాప్మన్ స్టంప్‌ను తాకి అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో సీఫర్ట్ ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్ కిషన్ బౌండరీ వద్ద పరుగెత్తి పట్టుకున్నాడు. అప్పటికే స్కోరు 8.1 ఓవర్లలో 72 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోవడంతో విజయం దాదాపు భారత్ వైపు మొగ్గు చూపింది. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వెళ్లింది. బుమ్రా అద్భుత బౌలింగ్ చేస్తూ నాలుగు వికెట్లు తీశాడు. 15 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు సాధించిన బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
Next Story

