Sun Dec 14 2025 00:23:37 GMT+0000 (Coordinated Universal Time)
India vs Australia T20 : ఆఖరిపోరుకు అంతా సిద్ధం.. సిరీస్ తేలేది నేడే
భారత్ - ఆస్ట్రేలియాల మధ్య చివరి టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదన్నది తేల్చనుంది

భారత్ - ఆస్ట్రేలియాల మధ్య చివరి టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదన్నది తేల్చనుంది. దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వన్డే సిరీస్ ను చేజార్చుకున్న టీం ఇండియా టీ20 సిరీస్ ను చేజిక్కించుకుని ఆస్ట్రేలియా పై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తుంది. మరొకవైపు ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఆసిస్ భావిస్తుంది. అందుకే ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమనే చెప్పాలి. హోరీ పోరు జరగనుంది. సిరీస్ ను సమం చేయడానికి ఆసిస్, సొంతం చేసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తున్నాయి.
ఈ మ్యాచ్ గెలిస్తేనే...
ఇప్పటికే భారత్ - ఆస్ట్రేలియా ల మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో 2-1 ఆధిక్యతతో భారత్ ఉంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అయితే ఆస్ట్రేలియాకు సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు. యాషెస్ సిరీస్ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాళ్లు దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ అని చెప్పాలి. భారత యువజట్టు మాత్రం రెండు మ్యాచ్ లు గెలిచి మంచి ఉత్సాహంతో ఉంది. అయితే భారత్ ఈ చివరి మ్యాచ్ లో కొద్దిపాటి మార్పులతో బరిలోకి దిగే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ప్రయోగాలతో ముందుకు...
టీ20 ప్రపంచకప్ కు ముందు ఈ మ్యాచ్ లో భారత్ కొన్ని ప్రయోగాలు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, సంజూ శాంసన్ ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. దీంతో పాటు శివమ్ దూబే, శుభమన్ గిల్ కు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. అయితే సిరీస్ ను సొంతం చేసుకోవాలనుకునే సమయంలో ప్రయోగాలకు మంచి సమయం కాదని కొందరు సూచిస్తున్నారు. కానీ తమ దృష్టంతా ప్రపంచ కప్ పైనే ఉండటంతో ప్రయోగాలు చేస్తే తప్పేంటన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. మొత్తం మీద కొద్ది పాటి మార్పులతో భారత్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశాలున్నాయన్నది సుస్పష్టం. వాతావరణం అనుకూలంగానే ఉంటుందని చెబుతున్నారు.
Next Story

