Thu Mar 05 2026 09:30:42 GMT+0530 (India Standard Time)
T20 World Cup : గెలుస్తూ వచ్చి చతికిలపడిన దక్షిణాఫ్రికా... పడుతూ లేస్తూ వచ్చి నిలిచిన న్యూజిలాండ్
దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ గెలిచి ఫైనల్స్ కు చేరుకుంది

టీ20 వరల్డ్ కప్ లో మరో షాకింగ్ ఘటన జరిగంది. గ్రూప్ దశలోనూ, సూపర్ 8 లోనూ ఓటమి అనేది లేకుండా, తమకు ఎదురు లేకుండా వచ్చిన దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్స్ లో ఓటమి పాలయింది. గెలుస్తూ.. ఓడుతూ.. అదృష్టం కలిసి.. రన్ రేట్ తో సెమీ ఫైనల్స్ లోకి వచ్చిన న్యూజిలాండ్ జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. ఎలా వచ్చామని కాదన్నాయ్యా... ఎప్పుడు ఆడామన్నదే అన్నరీతిలో దక్షిణాఫ్రికాపై సెమీ ఫైనల్స్ లో గెలిచి న్యూజిలాండ్ ఫైనల్స్ లో సగర్వంగా నిలిచింది.పదుైన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.ఫిన్ అలెన్ కేవలం 33 బంతుల్లో శతకం బాది దక్షిణాఫ్రికా ఆశలను చిదిమేశాడు. బుధవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ గెలిచి ఫైనల్స్ కు చేరుకుంది
కేవలం 12.5 ఓవర్లలోనే...
170 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే న్యూజిలాండ్ చేధించింది. అలెన్ 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాదుతూ మ్యాచ్‌ను ఒక్కదారిలో నడిపించాడు. ఈ శతకం టి20 ప్రపంచకప్ చరిత్రలోనే వేగవంతమైనది. బంతులు గ్యాలరీల్లోకి ఎగిరిపోయాయి. 76 పరుగుల నుంచి వంద పరుగులు చేయడానికి అలెన్ కు కేవలం ఐదు బాల్స్ మాత్రమే సరిపోయాయంటే ఏ రకంగా బాదాడో వేరే చెప్పాల్సిన పనిలేదు. అలెన్ బాదుడును దక్షిణాఫ్రికా జట్టుతో పాటు మొత్తం స్టేడియం పైకే చూస్తూ ఉండి పోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్ కె జట్టు మొదట బౌలింగ్‌లో కట్టుదిట్టంగా ఆడింది. దక్షిణాఫ్రికాను కేవలం 169 పరుగులకే పరిమితం చేసింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లను ఇరవై ఓవర్లలో తీయగలిగింది.
దంచికొట్టడంతో...
స్పిన్నర్లు మెకాంచీ, రచిన్ రవీంద్ర లు తలో రెండు వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన ఇచ్చారు. అయితే జాన్సన్ 30 బంతుల్లో 54 పరుగులతో పోరాడాడు. అతడికి స్టబ్స్ (29) తోడయ్యాడు. ఆరో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. మధ్యలో మంచు ప్రభావం పెరగడంతో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. చేజింగ్‌లో సీఫర్డ్ (33 బంతుల్లో 58) అలెన్‌తో కలిసి తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 117 పరుగులు జోడించాడు. పవర్‌ప్లేలోనే 84 పరుగులు వచ్చాయి. ఆరో ఓవర్ వేసిన బోష్ 22 పరుగులు ఇచ్చాడు. అలెన్ 19 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. రెండో అర్ధశతకానికి 14 బంతులే తీసుకున్నాడు. మధ్యలో మెడికల్ టైమ్ అవుట్ తీసుకున్నా జోరు తగ్గలేదు. మ్యాచ్ ముగిసే సమయానికి జాన్సన్ బౌలింగ్ నిరాశపరిచింది. అలెన్ దూకుడుతో దక్షిణాఫ్రికా ముఖాల్లో చిరునవ్వు చెరిగిపోయింది. న్యూజిలాండ్ రెండో సారి టి20 ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకుంది. గురువారం ముంబయిలో జరిగే మరో సెమీఫైనల్లో భారత్ ఇంగ్లండ్‌ను ఓడిస్తే, గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మళ్లీ రిపీట్ అవుతుంది.
Next Story

