Wed Jul 16 2025 23:33:01 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : పాపం పంజాబ్.. ప్రీతి జింటా ఆశలు నిజం కాలేదుగా?
ఐపీఎల్ 2025 ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేసిన స్కోరు చూసిన తర్వాత ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ విజయం ఖాయమనుకున్నారు.

ఐపీఎల్ 2025 ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేసిన స్కోరు చూసిన తర్వాత ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ విజయం ఖాయమనుకున్నారు. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆ జట్టు తక్కువ స్కోరును సులువుగానే అధిగమిస్తుందని భావించారు. ప్రియాంశ్ ఆర్యా, ప్రభ్ సిమ్రాన్, ఇంగ్లిస్, శ్రేయస్ అయ్యర్ శశాంక్ సింగ్ ఇలా ఎవరిని చూసినా సికర్లు, ఫోర్లతో అదరగొట్టేవారే. 190 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ సులువుగానే అధిగమిస్తుందని, మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓటమి ఖాయమయిందని అందరూ అంచనా వేశారు. స్కోరు చూసి స్టేడియంలోనే కాదు.. టీవీలు చూసే వారు కూడా ఛాంపియన్ షిప్ పంజాబ్ కింగ్స్ దే అని ఫిక్స్ అయ్యారు.
తమదే విజయం అనుకున్నా...
ఇక పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జింటా కూడా అదే ఫీలింగ్ లో ఉన్నారు. స్టేడియంలో ఇక తాను చిందులు వేయడం ఒక్కటే తక్కువని భావించారు. కానీ అది క్రికెట్. ఎవరూ చెప్పలేరు. విజయం చివర వరకూ ఊరించి ఆఖరుకు పంజాబ్ గడప ముందు నుంచి వెళ్లిపోయింది. శశాంక్ సింగ్ ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. మంచి బ్యాటర్లు అనుకున్న వాళ్లంతా ఫైనల్స్ కు వచ్చేసరికి ఫెయిల్ అయినట్లే అనిపించింది. ప్రియాంశ్ ఆర్య 24 ,ప్రభ్ సిమ్రన్ సింగ్ 26, ఇంగ్లిస్ 39, శ్రేయస్ అయ్యర్ కూడా ఒక పరుగుకే అవుట్ కావడంతో పంజాబ్ కింగ్స్ లో నీరసం ఆవరించింది. శశాంక్ సింగ్ చివర వరకూ నిలబడి పోరాడినా ఆ లక్ష్యాన్ని అందుకోవడం సాధ్యం కాలేదు.
స్వల్ప తేడాతోనే...
ఫలితంగా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం ఆరు పరుగుల తేడాతోనే ఓటమి పాలయింది. కప్పు చేతికి అందినట్లే అంది అందకుండా పోవడంతో ప్రీతి జింటా తో పాటు పంజాబ్ కింగ్స్ అభిమానులు కూడా నీరసపడ్డారు. చివరి క్షణం వరకూ కప్పు తమదేనన్న భావనలో ఉన్న వారంతా చేజారిపోవడంతో ఒక్కసారిగా కూలపడిపోయారు. ప్రీతి జింటా అయితే కూర్చున్న చోట నుంచి లేవలేకపోయారు. స్టేడియంలోజరుగుతున్నది కలా? నిజమా? అన్నది అర్థం చేసుకునే లోపు మ్యాచ్ ముగిసింది. కప్పు చేజారిపోయింది. సుదీర్ఘకల నెరవేరకుండానే ఈ సీజన్ కూడా వెళ్లిపోయింది. ఇక నెక్ట్స్ సీజన్ బెటర్ లక్ అంటూ వెళ్లిపోవడం కనిపించింది.
Next Story