Sun Dec 08 2024 06:04:50 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగు లక్షల ఖర్చు, 1500 మంది వచ్చారు.. కారుకు అంత్యక్రియలు
కొన్ని వస్తువులు కలిసొస్తే వాటిని విడిచిపెట్టడానికి మనసు రాదు
కొన్ని వస్తువులు కలిసొస్తే వాటిని విడిచిపెట్టడానికి మనసు రాదు. ముఖ్యంగా వాహనాల విషయంలో కలిసొచ్చిన బండి అమ్మడం కుదరదు అంటూ చెబుతుంటారు. అలా ఓ కారు కుటుంబాన్ని ఎన్నో కష్టాల నుండి బయటపడేసింది. 12 ఏళ్ల పాటూ కుటుంబం చేసిన పోరాటంలో తోడుగా నిలిచింది. అయితే ఆ కారును ఖననం చేయాలని గుజరాత్లోని ఒక కుటుంబం అనుకుంది. ఓ గుంత త్రవ్వించి అందులో కారును పాతిపెట్టారు. అంత వరకూ బాగానే ఉంది కానీ ఖననం చేసే కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు. దాదాపు 1500 మంది హాజరైన ఈ కార్యక్రమానికి 4 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసింది ఆ కుటుంబం.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈ ఘటన గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిలో కారుకు ఖననాన్ని నిర్వహించారు. మత ప్రముఖులు, ఆధ్యాత్మిక మార్గదర్శకులు, ఇతరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
వాగనార్ కారును ఖననం చేశారు. సంజయ్ పోలారా, అతని కుటుంబం ఈ ప్రత్యేక కారు గురించి "భవిష్యత్ తరాలకు శాశ్వతమైన జ్ఞాపకం" సృష్టించడానికి ఈవెంట్ను నిర్వహించినట్లు తెలిపింది. ఈ కారు తన కుటుంబానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని అతను పేర్కొన్నాడు. సంజయ్ పోలారా సూరత్లో నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. 12 సంవత్సరాల క్రితం ఈ కారును కొనుగోలు చేసానని, ఈ కారు కొన్న తర్వాత వ్యాపారంలో విజయాన్ని చూడడమే కాకుండా, నా కుటుంబం కూడా గౌరవాన్ని పొందిందన్నారు. వాహనం నా కుటుంబానికి,నాకు అదృష్టమని నిరూపించింది. అందుకే అమ్మే బదులు నా పొలంలో సమాధి చేశానని సంజయ్ పోలారా మీడియాతో అన్నారు. వాహనాన్ని పూలమాలలతో అలంకరించారు. పోలారా నివాసం నుండి వారి వ్యవసాయ భూమికి తరలించారు. అక్కడ ఓ గొయ్యిలో జాగ్రత్తగా ఉంచి శాస్త్రోక్తంగా ఖననం చేసారు.
Next Story