Sun Jan 11 2026 13:29:32 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులకు పండగ బస్సుల్లోనే కనపడుతుందిగా?
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే వారి నుంచి ప్రయివేటు ట్రావెల్స్ దోచుకుంటున్నాయి

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే వారి నుంచి ప్రయివేటు ట్రావెల్స్ దోచుకుంటున్నాయి.సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు దూర ప్రాంతాల నుంచి సొంత ప్రాంతాలకు అధిక సంఖ్యలో ప్రజలు ప్రయాణించడం వలన ఏర్పడే అధిక డిమాండ్ నేపథ్యంలోప్రైవేట్ బస్సు యజమానులు అధిక ధరలకు టికెట్లను విక్రయిస్తున్నారు. ముందుగానే టిక్కెట్లు రిజర్వు చేసుకున్న వారి నుంచి కూడా అధిక శాతం సొమ్ములు వసూలు చేస్తున్నారు. ప్రయివేటు ట్రావెల్స్ దోపిడీని అరికట్టాల్సిన రెండు రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. మూమూళ్ల మత్తులో తేలుతూ ట్రావెల్స్ యజమానులకు సహకరిస్తున్నారు.
ఆర్టీసీ పెంచిందని...
ఆర్టీసీ నిర్దేశించిన ధరల కంటే 50శాతం మాత్రమే గరిష్ట ధరగా నిర్ణయించింది. అంత కంటే ఎక్కువ ధరలకు టికెట్స్ అమ్మే ప్రైవేట్ బస్సు యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ నిర్ణయించింది. అయితే ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. హైదరాబాద్ నుంచి విజయవాడకు మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. విశాఖపట్నానికి నేడు ఆరు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అయినా రవాణా శాఖ అధికారులు మాత్రం ట్రావెల్స్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
హెల్ప్ లైన్ నెంబరు....
ప్రతి ప్రైవేట్ బస్సు లోనూ రవాణా శాఖ హెల్ప్ లైన్ నెంబర్ 92816 07001 ను డిస్ప్లే చేయాలని బస్ యజమానులను రవాణాశాఖ ఆదేశించింది. ఈ రోజు నుండి జనవరి 18వరకు అన్ని జిల్లాలో గల రవాణా అధికారులు ప్రైవేట్ బస్సులపై తనిఖీలు చేస్తామని ప్రకటించినప్పటికీ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యం దోపిడీకి మాత్రం తెరపడలేదు. పేద, మధ్యతరగతి ప్రయాణికులకు సంక్రాంతి పండగ వేళ ప్రయాణం జేబుకు చిల్లు పడేలా ఉంది. అయితే ఇంత ధరలను పెట్టి కొనుగోలు చేయలేని వారు ఆర్టీసీ, రైళ్లను ఆశ్రయిస్తుండటంతో అవి కిటకిటలాడుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టినప్పటికీ రద్దీ నేడు కూడా కొనసాగే అవకాశముంది.
Next Story

