Tue Jan 14 2025 05:52:33 GMT+0000 (Coordinated Universal Time)
Sankranthi : జాతీయరహదారిపై నిలిచిపోయిన వాహనాలు... ట్రాఫిక్ జామ్
సంక్రాంతికి సొంతూళ్లకు బయలుదేరే వారి సంఖ్య పెరిగింది. ఈరోజు ఉదయం నుంచి జాతీయరహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది
సంక్రాంతికి సొంతూళ్లకు బయలుదేరే వారి సంఖ్య పెరిగింది. ఈరోజు ఉదయం నుంచి జాతీయరహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఈరోజు నుంచి సెలవులు కావడంతో ఉదయాన్నే సొంత వాహనాల్లో ఆంధ్రప్రదేశ్ కు లక్షలాది మంది బయలుదేరారు. రైళ్లు, బస్సులు పూర్తిగా నిండిపోవడంతో పాటు కుటుంబ సభ్యులతో కలసి సొంత వాహనాల్లో తమ గ్రామాలకు బయలుదేరిన వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. సంక్రాంతి పండగకు తెలంగాణలో వారం రోజులు సెలవులు విద్యాసంస్థలు ప్రకటించడం కూడా కలసి వచ్చింది. వరసగా శని, ఆదివారాలు కూడా కలసి రావడంతో సొంత గ్రామాలకు బయలుదేరే వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
రద్దీ పెరగడంతో...
దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల వద్ద రద్దీ పెరిగింది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ఎక్కువ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. ఫాస్టాగ్ సౌకర్యం ఉన్నప్పటికీ వాహనాలు టోల్ గేట్ దాటి వెళ్లేందుకు కొద్దిగా సమయం పడుతుండటంతో నిదానంగా సాగుతున్నాయి. అయితే ఇప్పటికే టోల్ ప్లాజా వద్ద పది గేట్లు విజయవాడ వైపునకు వెళ్లే దారులు తెరిచారు. అయినా కూడా వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టోల్ ప్లాజా దాటడానికే ఎక్కువ సమయం పడుతుంది. దీంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ త్వరగా వెళ్లకపోవడం ఏంటని కొందరు నిలదీస్తున్నారు.
ఫాస్టాగ్ ద్వారా...
టోల్ ప్లాజాల నిర్వాహకులు ఫాస్టాగ్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ ఒక్కసారి వాహనాలు రావడంతో రద్దీ పెరిగి వాహనాలు టోల్ ప్లాజా ను దాటడానికి ఎక్కువ సమయం పడుతుంది. సంక్రాంతి సెలవులు ఈ ఏడాది ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ గా కుటుంబ సభ్యులందరూ కలసి ఒకే వాహనంలో బయలుదేరారు. దీంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఇక పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నరద్దీ మిగిలిన టోల్ ప్లాజాల వద్ద కూడా ఇలాగే కొనసాగే అవకాశముంది. అయితే చౌటుప్పల్ వద్ద అండర్ పాస్ నిర్మాణ పనులు జరుగుతున్నందున వాహనాలు నిదానంగా వెళుతుండటంతోనే ట్రాఫిక్ సమస్య ఏర్పడిందిని చెబుతున్నారు. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నా వాహనాలు మాత్రం వెళ్లడం ఆలస్యమవుతుంది.
Next Story