Tue Jan 13 2026 09:59:00 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రోజుల అద్దె లక్ష .. భీమవరం వెళ్లే వారికి అలెర్ట్
సంక్రాంతి పండగ నాడు కోడి పందేలు చూసేందుకు భీమవరం వెళ్లే వారికి అలెర్ట్.

సంక్రాంతి పండగ నాడు కోడి పందేలు చూసేందుకు భీమవరం వెళ్లే వారికి అలెర్ట్. అక్కడ ఉండేందుకు కూడా గదులు అద్దెకు దొరకడం లేదు. భీమవరంలోమూడు రోజులకు గది అద్దె లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హోటళ్లు, లాడ్జీలు ముందుగానే బుక్ అయ్యాయి.సాధారణ ధరల కంటే 3 నుంచి 4 రెట్లు అదనపు వసూలు చేస్తున్నారు లాడ్జీల నిర్వాహకులు. ఈ మూడు రోజుల పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి కోడిపందేలను తిలకిస్తారు. లక్షల సంఖ్యలో భీమవరానికి చేరుకుంటుండటంతో ముందుగానే ఆన్ లైన్ అద్దె గదులను బుక్ చేసుకున్నారు. మిగిలిన ఉన్న గదుల ధర మోతెక్కుతుంది.
కోడిపందేలకు...
పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలు కాకముందే లాడ్జీలు ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా కోడి పందేలకు కేంద్రబిందువైన భీమవరంలో ఈసారి పండుగ జోష్ గతానికి మించి కనిపిస్తోంది. పందేలను తిలకించేందుకు ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తుండటంతో వసతి గదులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు వంటి పట్టణాల్లోని దాదాపు 150 హోటళ్లలో ఒక్క గది కూడా ఖాళీ లేదు. డిమాండ్‌ను సాకుగా చూపుతూ యజమానులు అద్దెలను భారీగా పెంచేశారు. సాధారణంగా రోజుకు రూ. వెయ్యి నుంచి రూ. 5 వేలు ఉండే గది ధర, ఇప్పుడు మూడు రోజుల ప్యాకేజీ కింద రూ. 30 వేల నుంచి రూ. 60 వేల వరకు పలుకుతోంది.
మూడు రోజులకు...
భీమవరంలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో మూడు రోజులకు ఒక్కో గదికి లక్ష చొప్పున వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బరుల నిర్వాహకులు సైతం గెస్ట్ హౌస్‌లను ముందే రిజర్వ్ చేయడంతో సామాన్య పర్యాటకులకు వసతి భారంగా మారింది. ఈసారి బరుల వద్ద పందేల జోరు మరింత పెరగనుంది. ఇప్పటికే నిర్వాహకులు పందెంగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తాడేపల్లిగూడెంలో 2.5 కోట్ల రూపాయలతో ఒక భారీ పందెం సిద్ధమవ్వగా, సీసలి, నారాయణపురం, చినఅమిరం వంటి ప్రాంతాల్లో రూ. కోటి పందేలకు సిండికేట్లు కాలుదువ్వుతున్నాయి. గత ఏడాది పెద్ద మొత్తంలో గెలిచిన పందెంగాళ్లను తమ బరులకు రప్పించేందుకు నిర్వాహకులు పోటీ పడుతున్నారు. అందుకే భీమవరం వెళ్లే వారు ముందుగా గదులను రిజర్వ్ చేసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు పడతారు.
Next Story

