TGRERA: బాచుపల్లి 'నెబ్యులా ఆవాస్' కు టీజీరేరా ఆదేశాలు....
పాత కేటాయింపుదారుల జరిమానాలను తొలగించాలని, ఖాతాలను సవరించాలని, బకాయిలు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించింది.

బాచుపల్లిలోని “నెబ్యులా ఆవాస్ ” ప్రాజెక్టు విషయంలో పాత కేటాయింపుదారుల కు విధించిన ఆలస్య రుసుములు కొత్త ఫ్లాట్ కొనుగోలుదారులపై వేయకూడదని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీరేరా) ఆదేశించింది. చట్టబద్ధమైన బకాయిలు చెల్లించిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఈ ఆదేశాలు పసిఫికా కన్స్ట్రక్షన్స్ ప్రమోట్ చేసిన, నెబ్యులా బ్రాండ్ పేరుతో మార్కెట్ చేసిన నెబ్యులా ఆవాస్ హైదరాబాద్‌పై దాఖలైన పలు ఫిర్యాదులపై వెలువడ్డాయి.
పాత బకాయిలు కొత్త కొనుగోలుదారులకు.....
అపర్ణ నునా, నునా వెంకట సూర్యనారాయణ ఫ్లాట్ కేటాయింపుదారులు రెండు ఫ్లాట్లపై ఫిర్యాదు చేశారు. 2018 డిసెంబర్ 15న తమకు కేటాయింపు జరిగినప్పటికీ, అంతకుముందు సంబంధించిన ఆలస్య రుసుములు కూడా వసూలు చేశారని వారు తెలిపారు. 2019 జనవరి 18న చేసిన విక్రయ ఒప్పందంలో ఈ చార్జీల వివరాలు లేవని చెప్పారు.
ప్రమోటర్ వాదిస్తూ, ఫిర్యాదుదారులు పూర్వ కేటాయింపుదారుల స్థానంలోకి వచ్చారని, పెండింగ్ బకాయిలు చెల్లించాల్సిందేనని తెలిపింది. ప్రాజెక్టు పూర్తైందని, మిగిలిన మొత్తం చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని పేర్కొంది.
దాఖలైన రికార్డులను పరిశీలించిన అథారిటీ, పూర్వ కేటాయింపులపై ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని గమనించింది. ఫిర్యాదుదారులు పాత తప్పిదాలకు బాధ్యత వహించాల్సిందేనని చెప్పే ఒప్పంద నిబంధన కూడా లేదని స్పష్టం చేసింది. ఆలస్య రుసుములు విధించాలంటే స్పష్టమైన ఒప్పంద నిబంధన లేదా కేటాయింపుదారుల సొంత తప్పిదం ఉండాలని తేల్చింది.
అందుకే, పూర్వ కేటాయింపుదారులకు సంబంధించిన అన్ని ఆలస్య చార్జీలను తీసేసి ఖాతాలను మళ్లీ సిద్ధం చేయాలని, కేటాయింపు తర్వాత జరిగిన ఆలస్యాలకే చార్జీలు లెక్కించాలనీ టీజీఆర్‌ఈఆర్‌ఏ ఆదేశించింది.
చెల్లింపుల తర్వాత రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన తర్వాత రిజిస్ట్రేషన్ డీడ్ నమోదు చేసి, కొనుగోలుదారులకు అప్పజేపీలని అథారిటీ గుర్తుచేసింది. సవరించిన ఖాతా వివరాలను స్పష్టంగా అందజేయాలని, చట్టబద్ధ బకాయిలు చెల్లించగానే రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని స్పష్టం చేసింది.
ఆలస్యనికి, మానసిక వేదనకు నష్టపరిహారం కోరిన అంశంపై అథారిటీ వివరణ ఇస్తూ, ఆర్థిక పరిహారం అంశం అడ్జుడికేటింగ్ అధికార పరిధిలోకి వస్తుందని, రెగ్యులేటరీ అథారిటీ పరిధిలో కాదని తెలిపింది.
నిర్వహణ రుసుముల పెంపు...
నిర్వహణ చార్జీలు చదరపు అడుగుకు ₹1.25 నుంచి ₹3.60కు పెంచడాన్ని ఫిర్యాదుదారులు అభ్యంతరం చెప్పారు. 2019 ఒప్పందానికి ఆరు సంవత్సరాలు గడిచాయని, ద్రవ్యోల్బణం, నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని అథారిటీ పేర్కొంది. ప్రస్తుత దశలో పెంపును నిలబెట్టినా, 30 రోజుల్లో కేటాయింపుదారుల సంఘం సాధారణ సమావేశం నిర్వహించి భవిష్యత్ రుసుములపై ఏకాభిప్రాయం తీసుకోవాలని ఆదేశించింది.
జీఎస్టీ విషయంలో 1 శాతం బదులు 8 శాతం వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు కొనసాగుతున్నదని, పాత విధానంలో 8 శాతం రేటు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో కొనసాగామని ప్రమోటర్ తెలిపింది. జీఎస్టీ రేటు నిర్ణయం, అదనపు వసూళ్ల అంశం జీఎస్టీ అధికారుల పరిధిలోకి వస్తుందని అథారిటీ స్పష్టం చేసింది. సంబంధిత పన్ను అధికారిని సంప్రదించాలనీ ఫిర్యాదుదారులకు సూచించింది.
ఇతర ఫ్లాట్ల కేసుల్లోనూ....
వన్నెం రెడ్డి శ్రీరామ్ సాగర్, వన్నెం రెడ్డి వరలక్ష్మి అన్నపూర్ణ దాఖలు చేసిన మరో రెండు ఫ్లాట్ల కేసుల్లోనూ పాత కేటాయింపుదారుల జరిమానాలను తొలగించాలని, ఖాతాలను సవరించాలని, బకాయిలు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించింది. నిర్వహణ చార్జీలపై సాధారణ సమావేశం పెట్టాలని పేర్కొంది.
యేతి రమేష్, యేతి సుమంత్ దాఖలు చేసిన మరో రెండు ఫ్లాట్ల కేసుల్లోనూ అన్యాయంగా వేసిన ఆలస్య చార్జీలను తీసేసి, విక్రయ ఒప్పందం ప్రకారం మాత్రమే బకాయిలు లెక్కించాలనీ తెలిపింది. చెల్లింపుల తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేసింది.
ఆదేశాలను అమలు చేయకపోతే శిక్షాత్మక చర్యలు తీసుకుంటామని అథారిటీ హెచ్చరించింది. కేసులను ఖర్చులపై ఎలాంటి ఆదేశాలు లేకుండా ముగించింది.
- Tags
- TGRERA
- Bachupally

