Tue Jan 20 2026 02:41:12 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ అవినాశ్ కు సుప్రీంలో చుక్కెదురు
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కొద్దిరోజులుగా హాజరు కాకపోవడంతో.. నిన్న సీబీఐ అధికారులు..

వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కొద్దిరోజులుగా హాజరు కాకపోవడంతో.. నిన్న సీబీఐ అధికారులు కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీం ను ఆశ్రయించాడు. వివేకా హత్యకేసు విచారణలో భాగంగా.. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వాదనలు వినేంత వరకూ తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలన్న విన్నపాన్ని సుప్రీం తిరస్కరించింది.
మే25న అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. కాగా.. ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చని అవినాశ్ కు సూచించింది. కానీ అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే సీబీఐ విచారణకు ఎందుకు హాజరు కావట్లేదని అవినాశ్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ విచారణకు సీబీఐ తరపు న్యాయవాది హాజరుకాలేదు.
Next Story

