Sun Dec 14 2025 01:50:09 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ కు గట్టిషాక్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ !
పార్టీలోకి పీకే చేరికను వ్యతిరేకిస్తున్న కొందరు నేతలను ఒప్పించే పనిని సోనియా చేపట్టారని, సోనియా చర్చలతో..

న్యూఢిల్లీ : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు ప్రశాంత్ కిశోర్. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరేందుకు తిరస్కరించిన విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. నిర్దిష్టమైన బాధ్యతలతో పార్టీలో చేరాలని స్వయంగా సోనియా ప్రతిపాదించగా..ఆ ప్రతిపాదనను ప్రశాంత్ కిశోర్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. దీనిపై ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీలో చేరడంలేదని స్పష్టం చేశారు. ఆ పార్టీకి సలహాదారుగా మాత్రమే వ్యవహరిస్తానని వెల్లడించారు. తాను పార్టీలో ఉండడం కంటే సలహాదారుగా ఉండడమే అవసరమని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.
ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ప్రశాంత్ కిశోర్ వరుస భేటీల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. వీరిద్దరి వరుస సమావేశాలతో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. పార్టీలోకి పీకే చేరికను వ్యతిరేకిస్తున్న కొందరు నేతలను ఒప్పించే పనిని సోనియా చేపట్టారని, సోనియా చర్చలతో వారు కూడా మెత్తబడ్డారన్న వార్తలూ వచ్చాయి. అంతటితో ఆగలేదు.. ప్రశాంత్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమని, చేరిక అనంతరం ఆయనకు పార్టీ కీలక బాధ్యతలను కూడా అప్పగించనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరడం లేదన్న సంచలన ప్రకటన వచ్చింది. ఈ విషయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మరి ప్రశాంత్ కిశోర్ ఏ పార్టీలో చేరతారు ? అసలు రాజకీయ పార్టీలో చేరతారా ? లేక వ్యూహకర్తగానే ఉండిపోతారా ? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Next Story

