Fri Dec 06 2024 17:39:47 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ, కాంగ్రెస్ లపై కవితక్క ఫైర్..అర్వింద్, రాహుల్ లపై ధ్వజం
ప్రజలు ఎన్నుకున్న అర్వింద్ కు నియోజకవర్గప్రజలకు సేవ చేసే అవకాశమివ్వాలనే.. ఈ మూడేళ్లు తానేమీ మాట్లాడలేదని ..
నిజామాబాద్ : మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఫైర్ అయ్యారు. బుధవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు. 2019 ఎన్నికల్లో తనపై పోటీ చేసిన గెలిచిన ధర్మపురి అర్వింద్.. నిజామాబాద్ ప్రజలకు ఏం మేలు చేశాడని ప్రశ్నించారు.
ప్రజలు ఎన్నుకున్న అర్వింద్ కు నియోజకవర్గప్రజలకు సేవ చేసే అవకాశమివ్వాలనే.. ఈ మూడేళ్లు తానేమీ మాట్లాడలేదని కవిత చెప్పుకొచ్చారు. మూడేళ్లకాలంలో అర్వింద్ నిజామాబాద్ ప్రజలకు చేసిందేమీ లేదన్న కవిత.. పసుపుబోర్డు ప్రాంతీయ కార్యాలయంతో పాటు కేంద్రం నుంచి నిజామాబాద్ కు వచ్చినవన్నీ కూడా తాను ఎంపీగా ఉన్నపుడు మంజూరు చేసినవేనని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా నిజామాబాద్కైనా, యావత్తు తెలంగాణకైనా సేవ చేసే ప్రజా నాయకులు ఎవరో ప్రజలు గుర్తించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన గురించి మాట్లాడుతూ.. రాహుల్ తెలంగాణకు ఏం చేశారని పర్యటనకు వస్తున్నారని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం పోరాటం సాగిస్తున్న సమయంలో తెలంగాణ రైతులకు అనుకూలంగా పార్లమెంటులో మాట్లాడాలని తాము రాహుల్ గాంధీని కోరామని, కానీ తమ విజ్ఞప్తిని రాహుల్ మన్నించలేదని ఆరోపించారు. ఇప్పుడు కేవలం రాజకీయాల కోసమే వరంగల్, హైదరాబాద్ పర్యటనకు రాహుల్ వస్తున్నారని ధ్వజమెత్తారు.
Next Story