పవన్ ది పోరాటం కాదు.. ఆరాటం: మంత్రి అంబటి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కారణంగా రాజకీయాలకు అనర్హుడని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కారణంగా రాజకీయాలకు అనర్హుడని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలపై వివాదాలు చెలరేగడంతో పాటు వైసీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ స్ప్లిట్ పర్సనాలిటీని కలిగి ఉన్నారని, చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీ రావు, ఏబీఎన్ రాధా కృష్ణ, టీవీ5 నాయుడు వంటి వారిచే సులభంగా ప్రభావితమవుతారని అంబటి ఆరోపించారు. ఆవేశంతో ఊగిపోవడం పవన్‌కు అలవాటేనన్నారు. చెప్పులు చూపించి భూతులు తిట్టినప్పుడు పవన్ సంస్కారం ఏమైందని అంబటి ప్రశ్నించారు.
సీఎం జగన్ ను జగ్గూబాయ్ అని పిలుస్తున్న పవన్ పేరులోనే గాలి ఉందన్నారు. పవన్ కళ్యాణ్ అంటే గాలి కళ్యాణ్ అంటే ఎద్దేవా చేశారు. పవన్‌ని దగ్గరగా చూసిన వాళ్ళు ఆయనతో ఉండరు.. వెళ్ళిపోతారని అన్నారు. జగన్ పేరెత్తే అర్హత కూడా పవన్‌కు లేదన్నారు. పవన్ జీవితంలో అసెంబ్లీకి వెళ్ళలేడు.. చంద్రబాబును సీఎం చెయ్యలేడు అని అన్నారు. పవన్ ది పోరాటం కాదు ఆరాటం మాత్రమేనని విమర్శించారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కాపుల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నందున కాపు సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో పవన్ తరచూ పర్యటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, కాపు సామాజికవర్గం సీఎం జగన్‌కు మద్దతిస్తున్నదని, పవన్‌ని నమ్మడం లేదని అన్నారు.
పవన్ ఎన్నికల ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడుకు మేలు చేస్తారని నమ్ముతున్నారని అంబటి పేర్కొన్నారు. కాపులకు టీడీపీపై ఉన్న కోపాన్ని తగ్గించడానికే అక్కడ పవన్ యాత్ర చేపట్టారని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి, పవన్ ప్రకటనలు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న 1.3 లక్షల మంది మహిళా వాలంటీర్లను తీవ్రంగా బాధించాయని అంబటి హైలైట్ చేశారు. వాలంటీర్ల మనోధైర్యాన్ని పవన్ దెబ్బతీశారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఈ ఎపిసోడ్‌ని వైసీపీ సద్వినియోగం చేసుకుంటుందని, పవన్‌పై విమర్శలు గుప్పించేలా చేస్తుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ జనసేన, అధికార వైసీపీ మధ్య రాజకీయ పోటీ తీవ్రరూపం దాల్చిందని, ఎన్నికలకు ముందు ఇరువర్గాలు మాటల తూటాలు పేల్చుకుని లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని స్పష్టమవుతోంది.

