Tue Sep 26 2023 02:09:06 GMT+0000 (Coordinated Universal Time)
పొత్తు ప్రకటన వెనక?
బీజేపీతో మాట్లాడకుండా ఏకపక్షంగా పొత్తుతో వెళతామని ప్రకటించడాన్ని బీజేపీ నేతలు కొందరు తప్పుపడుతున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు ధర్మాన్ని విస్మరించారు. కనీసం బీజేపీతో మాట్లాడకుండా ఏకపక్షంగా పొత్తుతో వెళతామని ప్రకటించడాన్ని బీజేపీ నేతలు కొందరు తప్పుపడుతున్నారు. మిత్రపక్షమైన బీజేపీతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా, వారి అభిప్రాయం తెలుసుకోకుండా పవన్ టీడీపీతో కలసి వెళతామని ప్రకటించడమేంటని ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత తాము పవన్ కల్యాణ్ ను పొత్తుకు రావాలని కోరలేదని, ఆయనంటే ఆయనే వచ్చి తాను కలుస్తామని చెప్పిన విషయాన్ని కొందరు కమలం పార్టీ నేతలు ఈసందర్భంగా గుర్తు చేస్తున్నారు.
చాలా కాలంగా ఉన్నా...
బీజేపీ, టీడీపీ, జనసేన కలసి వెళ్లాలన్నదే తన ఆలోచన అని పవన్ కల్యాణ్ చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. అయితే టీడీపీతో పొత్తుపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర నాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో పవన్ బీజేపీని సంప్రదించకుండా 2024 ఎన్నికల్లో టీడీపీతో కలసి పోటీ చేస్తామని చెప్పడాన్ని చూస్తే పొత్తు ధర్మాన్ని విస్మరించడమేనన్న అభిప్రాయం కమలం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది.
కలసి రాకున్నా...
బీజేపీ కలసి రాకపోయినా టీడీపీతో కలసి నడిచేందుకే పవన్ డిసైడ్ అయినట్లు కనపడుతుంది. ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేకపోవడంతో అవసరమైతే కమలం పార్టీ పొత్తు నుంచి బయటకు రావాలని కూడా పవన్ యోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ ప్రకటన రాజమండ్రి కేంద్ర కారాగారం ఎదుట అకస్మాత్తుగా ప్రకటన చేశారంటున్నారు. పవన్ ప్రకటనతో బీజేపీ నేతలు కొంత డైలమాలో పడినట్లయింది. ఏపీ బీజేపీలో రెండు వర్గాలున్నాయి. ఒకటి టీడీపీ అనుకూల వర్గం కాగా, మరొకటి వ్యతిరేక వర్గం. చంద్రబాబు వ్యతిరేక వర్గం మాత్రం పవన్ ప్రకటనను సమర్థించడం లేదు. ఇప్పటికే పవన్ చేసిన ఈ ప్రకటనను పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రెండు రోజుల్లో జనసేన, టీడీపీ నేతల భేటీ ఉంటుందని, కో-ఆర్డినేషన్ కమిటీ వేస్తామని పవన్ ప్రకటించడం కూడా బీజేపీని పక్కన పెట్టినట్లేనని అంటున్నారు. వస్తే తమతో కలసి రావాలని, లేకుంటే లేదన్న సంకేతాలను బీజేపీకి పవన్ బలంగా పంపారు.
భిన్నాభిప్రాయాలు...
ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే పవన్ తొందరపడి ప్రకటన చేశారని కమలనాధులు అంటున్నారు. పార్టీ బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా చంద్రబాబుతో చేతులు కలపడమేంటని ఒక వర్గం నేతలు ప్రశ్నిస్తుండగా, మరొక వర్గం మాత్రం పవన్ చేసిన ప్రకటనలో వాస్తవముందంటున్నారు. అందరూ కలిస్తేనే జగన్ ను ఓడించడం సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ వంటి వారు తమ వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పినా బీజేపీ కూడా ఈ కూటమిలో కలవాల్సిందేనని అన్నారు. మొత్తం మీద ఏపీ బీజేపీలో పవన్ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం బీజేపీనే. పవన్ కల్యాణ్ పొత్తులపై బీజేపీ కోర్టులోనే బాల్ విసిారారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story