Sat Dec 14 2024 15:49:42 GMT+0000 (Coordinated Universal Time)
"వ్యూహం" లోపమా?
శాసనసభలో టీడీపీ వ్యూహం లోపం కొట్టొచ్చినట్లు కనపడింది. చంద్రబాబు జైలులో ఉండటంతో స్ట్రాటజీ నేతలకు కరువయింది
చంద్రబాబు ఉంటే అది వేరు. ఆయన వ్యూహాలు వేరుగా ఉంటాయి. ముందుగా పరిస్థితి అంచనా వేసి మరీ ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఆయన లేరు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్నారు. దీంతో వ్యూహరచన చేసే వారు లేకపోయారు. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలున్నప్పటికీ ఎందుకో తప్పులో కాలేశారనిపిస్తుంది. సభలో గందరగోళం చేయకుండా తమ నిరసనను తెలియజేసుంటే సస్పెండ్ అయ్యేవారు కాదు.
రేపు చర్చకు...
రేపు ఎటూ ప్రభుత్వం స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసుపై చర్చకు అంగీకరించింది. చర్చకు టీడీపీ సిద్ధమయి ఉంటే పయ్యావుల కేశవ్ వంటి వారు సమర్థంగా పార్టీ తరుపున వాదనలను వినిపించేవారు. కొద్దో గొప్పో సాంకేతికంగా, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో ఉన్న ఎమ్మెల్యేల్లో పయ్యావుల కేశవ్ ఒక్కరే కనిపిస్తున్నారు. ఆయన చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ సభలో తన వాదనను బాగా వినిపించే అవకాశం కలిగింది. ప్రభుత్వం ఏం చెప్పినా తమకు ఇచ్చిన సమయంలోనే ప్రభుత్వ తీరును ఎండగడుతూ వాదించే అవకాశాన్ని టీడీపీ కోల్పోయినట్లయింది.
పయ్యావుల సస్పెన్షన్‌తో...
పయ్యావుల కేశవ్ ఈ సెషన్ మొత్తం సస్పెండ్ అయ్యారు. దీంతో టీడీపీ తరుపున సమర్థమైన వాదనను వినిపించే వారు మాత్రం ఎమ్మెల్యేల్లో కనిపించడం లేదు. పయ్యావుల నేరుగా పోడియం వద్దకు వెళ్లకుండా నిరసన వరకూ తెలిపి ఉంటే బాగుండేదని ఎక్కువ మంది పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని టీడీపీ చేజేతులా కోల్పోయినట్లయిందన్న అభిప్రాయం పార్టీ క్యాడర్‌లోనూ వ్యక్తమవుతుంది. స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్లో తొలి నుంచి జరిగిన పరిణామాలు చెప్పే అవకాశాన్ని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కోల్పోయారు.
టీడీపీ సెల్ఫ్ గోల్ ....
రేపు అచ్చెన్నాయుడు ఈ అంశంపై మాట్లాడినా పెద్దగా జనంలోకి వెళ్లేలా ఉండదు. అచ్చెన్న అంత లోతుగా మాట్లాడరలేరన్న అభిప్రాయం పార్టీలోనే ఉంది. అందుకే వ్యూహం లేకుండా టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అందుకే అధికార పక్షం కూడా పయ్యావుల కేశవ్ ను సభలో లేకుండా జాగ్రత్త పడింది. రేపు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ పై చర్చ జరిగినా తమదే పైచేయి అవ్వాలని భావించిన అధికార పక్షం వేసిన ట్రాప్ లో తెలుగు తమ్ముళ్లు పడిపోయారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story