Sun Jan 12 2025 22:10:07 GMT+0000 (Coordinated Universal Time)
TDP చిన రాజప్పకు పెద్ద సమస్య వచ్చిందే.. టిక్కెట్ గల్లంతయినట్లేనా?
మాజీ హోంమంత్రి చినరాజప్పకు రాజకీయంగా ఇబ్బంది వచ్చింది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పెద్దాపురం నుంచి రావడం కష్టమే
మాజీ హోంమంత్రి చినరాజప్పకు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బంది వచ్చింది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పెద్దాపురం నుంచి రావడం కష్టంగానే కనిపిస్తుంది. దీంతో ఆయనకు పార్టీ మరొక నియోజకవర్గంలో పోటీకి దింపుతుందా? లేదా పక్కన పెడుతుందా? అన్నది తూర్పు గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. పెద్దాపురం నియోజకవర్గం నుంచి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరసగా రెండు సార్లు పెద్దాపురం నుంచి గెలిచిన చినరాజప్ప హ్యాట్రిక్ విజయం కోసం పరితపిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటుగా యువనేత లోకేష్ కు కూడా కావాల్సిన వాడు కావడంతో ఆయనకు టిక్కెట్ టెన్షన్ ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
హ్యట్రిక్ విజయం కోసం...
పెద్దాపురం నుంచి రెండుసార్లు గెలిచిన చినరాజప్పకు సీటు టెన్షన్ మొన్నటి వరకూ లేదు. జనసేనతో పొత్తు కుదిరినా తన సీటుకు వచ్చిన ముప్పేమీ లేదని ఆయన భావించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఒప్పించి అయినా సరే తనకు పెద్దాపురంలో మరోసారి చంద్రబాబు అవకాశం ఇస్తారని ఆయన భావించారు. అదే ధీమాతో ఉన్నారు. తొలి నుంచి టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న చినరాజప్పకు సౌమ్యుడిగా పేరుంది. అందుకే ఆయనకు 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించగానే హోంమంత్రిని చేశారు చంద్రబాబు. అలాంటి చిన రాజప్పకు ఇప్పుడు రాజకీయంగా కష్టాలు మొదలయినట్లేనని అంటున్నారు. అందుకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి.
తనకు అడ్డు లేకుండా...
అయితే చిన రాజప్ప తొలి నుంచి తనకు రాజకీయంగా పెద్దాపురంలో ఎలాంటి అడ్డులేకుండా నరుక్కుంటూ వస్తున్నారు. టీడీపీ హైకమాండ్ కూడా తన మాటకు విలువ ఇవ్వడంతో సొంత పార్టీలో శత్రుశేషాన్ని ఉంచుకోలేదు. అందుకే తనకు అడ్డుగా ఉంటాడనుకున్న బొడ్డు వెంకటరమణను రాజానగరానికి పంపగలిగారు. అందులో సక్సెస్ అయి మూడోసారి తాను పెద్దాపురంలో జెండా పాతడం ఖాయమని భావించారు. అందులోనూ తూర్పు గోదావరి.. ఆపైన జనసేన మిత్రత్వంతో ఇక గెలుపు నల్లేరు మీద నడకేనని భావించిన చిన రాజప్పకు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం రూపంలో పెద్ద కష్టమే వచ్చిపడిందన్న టాక్ వినిపిస్తుంది.
ముద్రగడ చేరితే..?
ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేనలోనో, టీడీపీలోనో చేరబోతున్నారు. ఏ పార్టీలో చేరినా ముద్రగడకు ఈ కూటమిలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కాపు సామాజికవర్గానికి ముద్రగడ పద్మనాభం బ్రాండ్ అంబాసిడర్ కావడంతో ఆయన డిమాండ్లకు తలొగ్గక తప్పదు. ఆయన ఈ రెండింటిలో ఏ పార్టీలో చేరినా నిమ్మకాయల చినరాజప్పకు ఎసరు పెడతారంటున్నారు. ముద్రగడ కుటుంబానికి పెద్దాపురంలో పట్టుండటమే ఇందుకు కారణం. అక్కడ కాపు సామాజికవర్గం కూడా ఎక్కువగా ఉండటంతో గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముద్రగడ రూపంలో ముప్పు చినరాజప్పకు పొంచి ఉందని వేరే చెప్పలేదనుకుంటా. అయితే సిట్టింగ్ లందరికీ సీట్లు అని ప్రకటించిన చంద్రబాబు చినరాజప్ప విషయంలో ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరొక నియోజకవర్గానికి షిఫ్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.
Next Story