Mon Dec 09 2024 04:48:45 GMT+0000 (Coordinated Universal Time)
టఫ్ ఫైట్ అట.. లేటెస్ట్ సర్వే లో తేలింది ఇలా
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. అయితే ఈసారి ఎవరిది అధికారం అన్న చర్చ జరుగుతుంది
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. అయితే ఈసారి ఎవరిది అధికారం అన్న చర్చ జరుగుతుంది. షెడ్యూల్ విడుదలయిన కొన్ని గంటల్లోనే సర్వే సంస్థలు కూడా తమ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏబీపీ, సీ ఓటర్ సర్వే నిర్వహించింది. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొని ఉందని సర్వేలో తేలింది. రెండూ పార్టీలూ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉన్నాయి. ఎవరిది అధికారం అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అధికార బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ విజయం అంత సులువు కాదన్నది ఏబీపీ, సీ ఓటరు సర్వే ప్రకారం స్పష్టమయింది.
కాంగ్రెస్కు ఎక్కువగా...
ఈ సర్వే ప్రకారం బీఆర్ఎస్ కు 43 నుంచి 55 శాసనసభ స్థానాలు మాత్రమే వస్తాయని తేలింది. కాంగ్రెస్ కు 48 నుంచి 60 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని సర్వే లో వెల్లడయింది. భారతీయ జనతా పార్టీ కేవలం ఐదు నుంచి పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలున్నాయని ఈ సర్వేలో స్పష్టమయింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రచారం నిర్వహించినా అంతకు మించి ఎక్కువ స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశాలు లేవని తెలిపింది.
ఓట్ల శాతాన్ని పెంచుకుని...
కాంగ్రెస్ 10.5 శాతం ఓట్లను పెంచుకుని 39 శాతం ఓట్లను సాధిస్తుందని సర్వే నివేదిక పేర్కొంది. తర్వాత బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో 9.4 శాతం ఓట్లు తగ్గి 37 శాతంతో వెనకబడి ఉంది. బీజేపీకి పదహారు శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. గతంలో కంటే 9.3 శాతం ఓట్లు పెరుగుతాయని సర్వే అంచనాలో స్పష్టమయింది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో 119 స్థానాలకు గాను బీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 19, బీజేపీ ఒక్క స్థానంలో గెలిచాయి. ఈసారి మాత్రం టఫ్ ఫైట్ అని ఏబీపీ, సీ ఓటర్ సర్వేలో స్పష్టమయింది.
Next Story