Thu Sep 12 2024 12:25:16 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : పదమూడు రోజులే గడువు.. జైలుకు వెళతారా? బయటే ఉంటారా?
చంద్రబాబు మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుంది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ఆయన మధ్యంతర బెయిల్ పై చికిత్స పొందుతున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో ఆయన మధ్యంతర బెయిల్ పై చికిత్స పొందుతున్నారు. ఈ నెల 28వ తేదీన తిరిగి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఇంకా పదమూడు రోజులు మాత్రమే గడువు ఉంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ పై తీర్పు కూడా దీపావళి పండగ సెలవుల తర్వాతనే అని చెప్పింది. అంటే ఈ నెల 30వ తేదీన తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నెల 28న జైలుకు సరెండర్ కావాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు విషయంలో ఏం జరుగుతుందన్న టెన్షన్ టీడీపీ నేతల్లోనూ, శ్రేణుల్లోనూ నెలకొంది.
రెండు నెలలు...
ఇప్పటికే దాదాపు రెండు నెలలు ఆయన ప్రజల్లో తిరగకుండానే పుణ్యకాలం గడిచిపోయింది. సెప్టంబరు 8వ తేదీన నంద్యాలలో స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో సీబీఐ చంద్రబాబును అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జనంలోకి వెళ్లడం లేదు. యాభై రెండు రోజులు జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ ఆరోగ్య పరీక్షలకే పరిమితమవ్వాలని, ఎటువంటి రాజకీయ కార్యక్రమాలను నిర్వహించకూడదని షరతులు విధించడంతో చంద్రబాబు హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు. కేవలం సూచనలు మాత్రమే నేతలకు ఇస్తున్నారు.
సీట్ల సర్దుబాటు...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా 90 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయం విపక్షంలో ఉన్న టీడీపీకి చాలదు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు వరకూ అంతా చంద్రబాబు మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆయన తెలంగాణ ఎన్నికలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినేత హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరికాసేపట్లో దీనిపై విచారణ జరగనుంది. అయితే ఈ విచారణ పూర్తయి ఈ నెల 28వ తేదీ లోపు అనుకూలంగా తీర్పు వస్తే వెల్ అండ్ గుడ్. లేదంటే కష్టాలు తప్పేట్లు లేదు. మళ్లీ జైలుకు వెళితే ఎన్ని రోజులు ఉండాలోనని టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు.
ప్రచారం కూడా...
నిధుల సమీకరణ నుంచి అభ్యర్థుల ఎంపిక వరకూ చంద్రబాబు స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. పైగా ఈసారి ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకం. ఈసారి గెలవకుంటే పార్టీ మనుగడకు కూడా ప్రమాదమే. అందుకే చంద్రబాబు బయట ఉండి.. యాక్టివ్ గా పాలిటిక్స్ లో పాల్గొనాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. టీడీపీకి ఏపీలో అభ్యర్థుల కొరత లేకపోయినప్పటికీ, స్వయంగా ఆయన ఎంపిక చేసిన తర్వాతనే ప్రచారానికి వెళతారు. ప్రచారం కూడా చంద్రబాబు వెళితేనే కొంత సానుకూల ఫలితాలు వస్తాయని నమ్ముతున్నారు. ఈపరిస్థితుల్లో రెగ్యులర్ బెయిల్ ఏమవుతుందో? అనుకూలమా? కాదా? అన్న భయంలో తెలుగు తమ్ముళ్లున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story