Tue Jan 14 2025 04:11:10 GMT+0000 (Coordinated Universal Time)
టిడిపి, వైసిపి లు అవినీతి, అక్రమాలలో సమానంగా ఉన్నాయి : కేంద్రమంత్రి
టిడిపి కుటుంబ పార్టీగానే పనిచేస్తోందన్న మురళీధరన్.. అవినీతి, అక్రమాలలో టిడిపి, వైసిపి పార్టీలు రెండూ సమానంగా పోటీ..
బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ టీడీపీ లకు ప్రత్యామ్నాయ రాజకీయ పక్షంగా, ప్రధాన పాత్ర పోషించాలని, అందుకోసం ప్రజాసమస్యలను గుర్తించి, పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేయాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ మురళీధరన్ పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరులో జరిగిన కోస్టల్ జోన్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మురళీధరన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వ, కుటుంబ, అవినీతి అక్రమాలపై పోరాటాలు చేసి, ప్రజల పక్షాన నిలబడి, ప్రజల మన్ననలు పొంది, బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
టిడిపి కుటుంబ పార్టీగానే పనిచేస్తోందన్న మురళీధరన్.. అవినీతి, అక్రమాలలో టిడిపి, వైసిపి పార్టీలు రెండూ సమానంగా పోటీ పడుతున్నాయని అన్నారు. కేంద్రంలో ఉన్న మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రజా సంక్షేమానికై చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలన్నారు. పార్టీని పోలింగ్ బూత్ స్థాయి, శక్తి కేంద్రాల స్థాయి, మండల స్థాయి & జిల్లాలలో మరింత పటిష్టం చేసేలా అందరూ కలిసి సమిష్టిగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. పోలింగ్ బూత్, గ్రామ, మండల స్థాయిలో ప్రజాసమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాలు నిర్వహించి, వాటి పరిష్కారానికి దోహదపడాలని కార్యకర్తలకు సూచించారు.
ప్రజా నాయకులుగా ఎదగాలి :
పార్టీని సంస్థాగతంగా పటిష్టానికి ఎంత కృషి చేస్తామో.. నిరంతరం ప్రజలలో కలసి మెలసి, వారిలో గుర్తింపు తెచ్చుకుని, తద్వారా "ప్రజా నాయకులుగా" ఎదగాలని మంత్రి మురళీధరన్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ'ని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తయారుచేయడంలో భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
బీజేపీ కమిటీలతో పాటుగా వివిధ మోర్చాలు, సెల్స్, డిపార్ట్మెంట్స్, పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు కూడా, వారి విభాగాలలో కూడా ప్రజాసమస్యలను గుర్తించి, వాటి పరిస్కారం కోసం నిరంతరం పోరాటాలు చేయాలన్నారు. అప్పుడే అన్ని వర్గాలకూ పార్టీ చేరువ అవుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న "మన్ కీ బాత్" కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయి వరకు తీసుకువెళ్లి ప్రజా భాగస్వామ్యం చేయాలని మంత్రి కోరారు.
Next Story