వైకాపాను వెనక్కు తగ్గమన్న న్యాయనిపుణులు

చంద్రబాబునాయుడు బ్లాక్ మనీ వెల్లడించిన హైదరాబాదీ వ్యాపారవేత్త గురించి తన మాటల్లో ప్రస్తావించారు. ఒక్కొక్కరు ఇంత భారీ మొత్తాలు ఎలా సంపాదిస్తారో కూడా అర్థం కావడం లేదంటూ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. పేరు ప్రస్తావించకుండా చంద్రబాబునాయుడు నల్లధనం వెల్లడించిన కుబేరుడు గురించి వ్యాఖ్యలు చేస్తే ఆ మరు రోజునుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయం పై ఉద్యమం ప్రారంభించింది. రోజుకొకరు వంతున జగన్ ను బ్లాక్ మనీ వెల్లడించినట్లుగా చంద్రబాబు ఆరోపించారని, ఆయనకు ఆ విషయం ఎలా తెలిసిందని తిట్టిపోస్తున్నారు. వైఎస్ జగన్ కూడా.. రహస్యంగా ఉండవలసిన నల్లధనం వెల్లడి పేర్లు చంద్రబాబుకు ఎలా తెలిశాయో చెప్పాలని కోరుతూ ప్రధానికి ఓ లేఖ కూడా రాశారు. నిజానికి చంద్రబాబు – జగన్ పేరు చెప్పకపోయినా వివాదం మాత్రం ఆ రూపంలోనే నడుస్తోంది.
తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో న్యాయపోరాటం చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం నాడు ప్రెస్ మీట్ పెట్టి.. చంద్రబాబును రోజా తిట్టిపోసిన సందర్భంలో కూడా.. విలేకరులు న్యాయపోరాటం చేస్తారా అని అడిగినప్పుడు తప్పకుండా చేస్తాం అంటే రోజా జవాబిచ్చారు.
రహస్యంగా ఉండవలసిన నల్లధనం వెల్లడి వ్యవహారం గురించి తనకు వివరాలు తెలిసినట్లుగా మాట్లాడినందుకు చంద్రబాబును కోర్టుకీడ్చగల అవకాశం గురించి వైకాపా నాయకులు న్యాయనిపుణులను కూడా సంప్రదిస్తున్నారట. అయితే అక్కడ వారికి ప్రతికూల స్పందన ఎదురవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వైకాపా నాయకులు న్యాయనిపుణుల్ని సంప్రదించినప్పుడు.. ఏదో రాద్ధాంతం చేయడానికి పనికొస్తుందే తప్ప.. ఈ విషయంలో న్యాయపరంగా పోరాడడానికి పెద్దగా పాయింట్ లేదని, బలం లేదని వారు చెబుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. జగన్ నల్లధనం వెల్లడించాడంటూ చంద్రబాబునాయుడు పేరు పెట్టిచెప్పలేదని, హైదరాబాదులోని ఒకే వ్యక్తినుంచి పది వేల కోట్లు వెల్లడైనట్లుగా మీడియాలో వచ్చిన కథనాలను మాత్రమే ప్రస్తావించారని.. అలాంటప్పుడు ఆయనను ప్రత్యేకంగా కోర్టుకు లాగడం కుదరదని, బలవంతంగా కేసు పెట్టినా సరే.. ఉపయోగం ఉండదని న్యాయనిపుణులు చెప్పినట్లు తెలుస్తున్నది. దీంతో చేసేదిలేక వైకాపా నాయకులు వెనుదిరిగినట్లు తెలుస్తోంది. న్యాయపోరాటం చేయబోతున్నాం.. చంద్రబాబుకు జైలుశిక్ష తప్పదు అని కొన్నాళ్లు యాగీ చేసి తర్వాత మిన్నకుంటే సరిపోతుందని వారు భావిస్తున్నట్లుగా ఉంది.

