వెంకయ్యపై ఫోకస్.. చంద్రబాబుపై సింపతీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడానికి మడమ తిప్పని పోరాటం సాగిస్తా అంటూ జనసేన పార్టీ అధినేత హీరో పవన్ కల్యాణ్ ముచ్చటగా తన మూడో సభను కూడా అనంతపురం వేదికగా పూర్తిచేశారు. ప్రత్యేక రైలులో ఢిల్లీకి ప్రతినిధుల్ని తీసుకువెళ్లి ఢిల్లీ పెద్దలకు తమ డిమాండు వినిపించాలనే మాట తప్ప.. అనంతపురం సభలో పవన్ కల్యాణ్ చెప్పిన కొత్త సంగతి అసలేమీ లేదు. రాజకీయాల్లో విధానాల మీదనే తన పోరాటం తప్ప.. వ్యక్తుల మీద తనకు ఎన్నడూ విభేదాలు ఉండవని పవన్ కల్యాణ్ సెలవిచ్చారు.
అయితే తనదైన శైలిలో సెటైర్లు సంధించడంలో మాత్రం పవన్ కల్యాణ్ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీద ఒక తీరుగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద ఒక తీరుగా స్పందించడం విశేషం.
వ్యక్తుల గురించి తాను మాట్లాడను అని అంటూనే వెంకయ్యనాయుడు మీద పవన్ కల్యాణ్ ఒకరేంజిలో విమర్శలు గుప్పించారు. చట్టబద్ధత లేని ప్యాకేజీ గురించి ఊరూరా సన్మానాలు చేయించుకుంటున్నారంటూ వెంకయ్యను దెప్పి పొడిచారు. ప్యాకేజీ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం అని అంటున్నారని.. మీరు సాధించకపోయినా పర్లేదు గానీ.. దయచేసి ప్యాకేజీని పలుచన చేసేలా మాట్లాడవద్దని పవన్ కల్యాణ్ అన్నారు. నిజానికి రాష్ట్రానికి హోదా ఎగవేస్తూ నిర్ణయం తీసుకున్న కోటరీలో కీలకంగా ప్రధానంగా ప్రధాని మోదీ, అరుణ్ జైట్లీ ప్రభృతులు ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ వారి మీద విమర్శల జోలికి పెద్దగా వెళ్లపోవడం విశేషం. వెంకయ్యనాయుడు రాష్ట్రాన్ని వంచించారని, ప్రజలను మోసం చేశారని మాత్రం సెలవిచ్చారు.
అదే సమయంలో.. వెంకయ్య కంటె ఎక్కువగా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా.. ప్రత్యేక హోదా అనేది జిందా తిలిస్మాత్ కాదనే దుందుడుకు ప్రకటనలుచేసినా, హోదా అనేది ఇక వచ్చే అవకాశం లేదని సెలవిచ్చినా, వాళ్లు ప్యాకేజీ కూడా ఇవ్వకపోతే ఏం చేస్తాం.. ఇచ్చిందే తీసుకోవాలి.. అంటూ తన చేతగానితనాన్ని తన మాటల్లోనే బయటపెట్టుకున్నా.. రాష్ట్రానికి చాలా అద్భుతమైన ప్యాకేజీ వచ్చింది.. హోదాను మించి ఈ ప్యాకేజీ వల్ల లబ్ధి చేకూరబోతోంది అని పదేపదే టముకు వేసినా.. చంద్రబాబునాయుడు మీద మాత్రం పవన్ కల్యాణ్ చాలా సున్నితంగా స్పందించడం గమనార్హం. మనకు రావాల్సినవి ఇవ్వడమే తప్ప, కొత్తగా ఏమీ లేని ప్యాకేజీ ప్రకటించినప్పుడు దాన్ని ఎందుకు ఒప్పుకున్నారో చంద్రబాబునాయుడు రాష్ట్రప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఒక విమర్శ మాత్రం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రాజకీయ అవినీతి పెరిగిపోయిందని అంటూ స్వీపింగ్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ .. ప్రభుత్వాధినేతగా పెరుగుతున్న అవినీతికి చంద్రబాబు బాధ్యత ఎంత అనే దిశగా ఒక్క మాట కూడా అనకపోవడం విశేషం.
పవన్ కల్యాణ్ వైఖరి ఒకే రకం వంచనకు , ఒకే రకం మాటల గారడీకి పాల్పడుతున్న ఇద్దరు నేతలమీద వేర్వేరుగా ఉండడంలో మర్మం ఏమైనా ఉన్నదా అని పలువురు ఆలోచిస్తున్నారు.

