రాబడిపై రాద్ధాంతం సహేతుకమేనా?

‘‘యాదగిరి ఓ కూలీ. మేస్త్రీ పని చేస్తాడు. ఏ రోజు కారోజు పని చేసుకుంటే తప్ప పొయ్యిలో పిల్లి లేవదు. పొద్దన్లేవగానే వెళ్లి అడ్డా మీద నిల్చుని, పని దొరకబుచ్చుకుని, సాయంత్రం దాకా కూలిచేసి.. శనివారం నాడు ఆ వారం రోజుల కూలిడబ్బులు తెచ్చుకుంటేనే మరుసటి వారం ఇల్లు గడిచేది. వచ్చిన సొమ్ములో ఓ అయిదొందలో, వెయ్యి రూపాయలో.. ఏదైనా ప్రాణం మీదికి వస్తే ఉపయోగపడుతుందని తీసి ఇంట్లోనే ఎక్కడో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ ఉంటాడు. నోట్లు చెల్లవనే మాట వినిపించిన ప్పుడు యాదగిరి కంగారు పడ్డాడు. ఇంట్లో ఉండే మూడో నాలుగో అయిదొందల నోట్లు చెల్లవని భయపడి ఎత్తుకుని బ్యాంకుకు వెళ్లాడు. కొన్ని గంటలపాటూ క్యూలైన్లో నిలబడ్డాడు. ఆ రోజు ఇక కూలికి వెళ్లడం కుదర్లేదు. బ్యాంకులో పని నడవలేదు. మరురోజు మళ్లీ రావాల్సి వచ్చింది. రెండు రోజుల కూలి జీవితాన్ని బ్యాంకు కబళించేసింది. అతడి చిన్న జీవితానికి అది చాలా పెద్ద దెబ్బ! అయితే మాత్రం ఏం.. ఓర్చుకున్నాడు.. ఏదో మోదీ మంచి పని చేద్దాం అనుకుంటున్నాడు.. మనం కొన్ని కష్టాలు పడాల్సిందే అనుకున్నాడు.. సర్దుకు పోదాం లెమ్మనుకుని ఊరకుండిపోయాడు.’’
ఓ యాదగిరి మాత్రమే కాదు ఒక యెంకటేశులు, ఒక అచ్చెమ్మ, ఒక నర్సింగ్ ఇలా అనేక మంది సామాన్య కూలి జనాలు పెద్ద నోట్ల రద్దు దెబ్బకు తమ జీవితాల్లోంచి ఎంతో కొంత రాబడిని త్యాగం చేస్తున్నారు. అలా అనడం కంటె ఎంతో కొంత నష్టాన్ని ఇష్టంగానే సహిస్తున్నారు. అంతే తప్ప.. వారెవ్వరూ కూడా.. నాకు రెండు రోజుల కూలీ లాస్ అయింది గనుక.. నరేంద్రమోదీ ఆ రెండు రోజుల కూలి డబ్బులను తన ఖాతాలో వేయాలని అడగడం లేదు.
సరిగ్గా ఈ పాయింటు దగ్గరే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు విచిత్రంగా కనిపిస్తోంది. ప్రజలకు వచ్చిన నష్టం లాగానే.. రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీల కార్యకలాపాలు ఒక్కసారిగా మందగించడం వలన పన్నుల రూపేణా ప్రభుత్వానికి రావాల్సిన రాబడి కూడా ఈ వారం రోజుల్లో కాస్త తగ్గింది. అయితే కేసీఆర్ మాత్రం తన సర్కారుకు మామూలుగా వచ్చే ఆదాయం కంటె ఇప్పుడు ఎంత తగ్గిందో లెక్కలు తయారుచేసి.. ఆ నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాలని, మోదీ సర్కారు ఆ నష్టాన్ని కేంద్రం నుంచి నిధులుగా విడుదల చేయాలని అడగడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి వాటిల్లిన నష్టం గురించి పలు ప్రకటనలు చేసిన కేసీఆర్ .. ఉన్నతాధికారులతో మీటింగు పెట్టి.. ఎంత నష్టం వాటిల్లిందో లెక్కలు తీయిస్తున్నారు. ఆమేరకు కేంద్రం నుంచి లాభపడాలనుకోవడమే చిత్రం. ఆ మాటకొస్తే ఈ నోట్ల రద్దు వలన సగటు మనిషి జీవితంలో రోజువారీ వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేసేదెవ్వరు?
మరో కోణం ఏంటంటే... ఇలాంటి నిర్ణయం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినప్పుడు.. రాబడిలో తగ్గే నష్టం అనేది దాదాపుగా అన్ని రాష్ట్రాలకు ఒకే రీతిగా ఉంటుంది. అయితే పన్నుల రూపేణా రాబడిలో నష్టం వచ్చిందని.. తతిమ్మా దేశంలోని ఏ రాష్ట్రాలూ విలపించని రీతిలో తెలంగాణ మాత్రం యాగీ చేస్తోంది. నిజానికి ఇది సహేతుకమైన ఆవేదన కాదని, పలువురు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ మరి వాస్తవ పరిస్థితుల్ని ఎలా ఎప్పటికి అర్థం చేసుకుంటారో చూడాలి.

