మోదీ స్కెచ్ : పన్నీర్‌కు ఆశీస్సులు; శశికళ చుట్టూ ఉచ్చు!!

తమిళనాడు రాజకీయాల్లో జయలలిత మరణం నేపథ్యంలో ఏర్పడిన ప్రతిష్టంభనను తమకు అనుకూలంగా మలచుకోవడానికి భారతీయ జనతా పార్టీ పెద్ద వ్యూహంతోనే అడుగులు వేస్తున్నదా? అన్నా డీఎంకే తమ అమ్ముల పొదిలో అస్త్రంగా మార్చుకోవడానికి, ఆ పార్టీలో కొరుకుడు పడకుండా ఉండగల వారికి ముందుగానే చెక్ పెట్టడానికి ప్రధాని నరేంద్రమోదీ ముందుగానే స్కెచ్ వేశారా? ఈ వ్యూహం అమలు బాధ్యతను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతుల్లో పెట్టారా? వెంకయ్య కనుసన్నల్లోనే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో మలుపులు చోటు చేసుకుంటున్నాయా? రాజకీయ పరిశీలకులలో తలెత్తుతున్న ఇలాంటి అనేకానేక ప్రశ్నలకు ‘అవు’ననే సమాధానమే వినిపిస్తుంది.
తమిళనాడులో అధికార పీఠాన్ని శశికళ తన హస్తగతం చేసోవాలని చూస్తున్నారంటూ అనేక వార్తలు వస్తున్నాయి. జయ మరణం వెంటనే.. ఆమె ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుపట్టి.. ఆ తర్వాత వెనక్కు తగ్గారనే పుకార్లు కూడా ఉన్నాయి. పన్నీర్ సెల్వం సీఎం అయ్యాక కేబినెట్ మొత్తాన్ని ఇంటికి పిలిపించుకుని వారితో ఆమె భేటీ అయ్యారు కూడా. ఇప్పుడు ఇన్నాళ్లూ జయలలిత నిర్వహించిన అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పోస్టును తనకు కట్టబెట్టాలని పన్నీర్ సెల్వంతో సహా ఇతర పార్టీ ముఖ్యులపై శశికళ ఒత్తిడి తెస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే తమిళ రాజకీయాల్లో భాజపాకు ఉనికి సృష్టించుకోవాలని చూస్తున్న మోదీ.. అక్కడి పరిణామాలను వాడుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. శశికళ అవినీతి గురించి మరింతగా తమ చేతులకు మట్టి అంటకుండా దుష్ప్రచారం జరిగేలా చూడడం, శశికళ మీద ప్రజల్లో అభిమానం రాకుండా ఏర్పడకుండా చూడడం, అదే సమయంలో పన్నీర్ సెల్వం ను తమవాడిగా చేసుకుని పార్టీని తమ వైపు తిప్పుకోవడం.. ఇలాంటి వ్యూహం అమలుకోసం పన్నీర్ సెల్వంకు అవసరమైన మద్దతును తాము తెరవెనుకనుంచి అందించడం మోదీ సర్కారు వ్యూహంగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి కీలక బాధ్యతలను మొత్తం గతంలో ఆ రాష్ట్రానికి పార్టీ ఇన్చార్జిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు చేతుల్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
వెంకయ్య ప్రమేయం కారణంగానే.. శశికళ సీఎం కాకుండా, పదవి పన్నీర్ ను వరించిందని కూడా అంటున్నారు. పన్నీర్ కు దన్నుగా నిలబడే ప్రక్రియగానే ఇప్పుడు శశికళ ఫైనాన్స్ వ్యాపారం, పన్నీర్ కు పోటీదారు పళనిస్వామి ఆస్తులు, శశికళకు దగ్గరైన శేఖర్ రెడ్డి ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని కూడా అంటున్నారు. అవినీతికి శశికళ మారుపేరుగా ఇప్పటికే అనేక కేసులు విచారణలో ఉన్నాయి. అవన్నీ నిజమే అనిపించేలా ప్రజల్లో ఆమె పట్ల తిరస్కారభావాన్ని నాటడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్లుంది. భాజపాకు సానుభూతి పరురాలైన సీనియర్ నటి జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆ అనుమానాలు శశికళ వైపు మళ్లేలా సంకేతాలు ఇస్తూ ప్రధానికి లేఖ రాయడం కూడా ఈ వ్యూహంలో భాగమే అనే ప్రచారం ఉంది.
ఈ స్కెచ్ మొత్తం నిజమైతే.. రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయ పరిణామాలు ఇలా ఉండే ఛాన్సుంది...
-) శశికళ మరియు ఆమె వర్గానికి చెందిన మద్దతు దారులందరి అవినీతి నిరూపణ అవుతుంది. కేసులు నడుస్తాయి. పాత కేసులు తిరగతోడుతారు. శశికళకు జైలు శిక్ష పడినా ఆశ్చర్యం లేదు.
-) శశికళ వర్గానికి ఆర్థిక మూలాలుగా ఉండగల సంపన్నుల ఆస్తులపై ఇంకా దాడులు జరుగుతాయి. వారిని ఆర్థికంగానూ, నైతికంగానూ దెబ్బతీయడం జరుగుతుంది. దీని ద్వారా వారు శశికళ కు మద్దతివ్వకుండా మిన్నకుండేలా చేయడం లేదా ఆమె గ్రూపులోనే ఉంటే గనుక.. ఆర్థికంగా దెబ్బకొట్టడం లక్ష్యాలు అవుతాయి.
-) జయలలిత మరణం మీద అనుమానాలు, హత్య జరిగిందనే ప్రచారం ఇంకా పెద్దస్థాయిలో శృతి మించుతుంది.
-) జయలలిత మరణంపై ‘ప్రజల సెంటిమెంటు మరియు కోరిక మేరకు’ కేంద్రం న్యాయవిచారణకు ఆదేశించినా ఆశ్చర్యం లేదు.
-) అన్నా డీఎంకే ఎన్డీయే కూటమిలో చేరుతుంది.
-) ఇన్నాళ్లూ జయలలిత చేతిలో కీలుబొమ్మలాగా సీఎం కుర్చీలో ఉన్న పన్నీర్ సెల్వం, ఇప్పుడు వెంకయ్యనాయుడు ఆడించే కీలుబొమ్మగా మారితే ఆశ్చర్యం లేదు.

