మోదీ కౌగిలి : బిగించి పట్టేస్తుందా?

తెలుగు భాషలో ‘ధృతరాష్ట్ర కౌగిలి’ అనే మాట, ఒక జాతీయంగా చెలామణీలో ఉంది.. పైకి కపటప్రేమను చూపిస్తూ... ఎదుటి వ్యక్తి సర్వనాశనాన్ని కోరుకునే వారి వైఖరిని ఆ మాటతో వ్యవహరిస్తారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ వ్యవహార సరళి.. ఈ ధృతరాష్ట్ర కౌగిలితో పోల్చడానికి వీల్లేదు గానీ.. ‘మోదీ కౌగిలి’కి ఓ భిన్నమైన నిర్వచనం రూపొందేలా కనిపిస్తోంది. కపట ప్రేమను కాకుండా, నిజమైన ప్రేమనే చూపిస్తూ.. ఆ ప్రేమానుబంధంలో ఎదుటివారిని శాశ్వతంగా బంధించి ఉంచేదే ఆ వ్యూహం. ఇప్పుడు తమిళనాడులో ఇదే రాజకీయ వ్యూహం చెలామణీ అయ్యేలా కనిపిస్తోంది. జయలలితను తమ కూటమిలో భాగస్వామిగా చేసుకోవాలని తొలినుంచి మోదీ ప్రయత్నించారు. తీరా ఇప్పుడు ఆమె మరణించిన తర్వాత.. పార్టీలో ఏర్పడిన సంక్షోభ సమయంలో.. దన్నుగా నిలవడం ద్వారా.. మీకు పెద్దదిక్కుగా నేనున్నాను అనే భరోసా ఇవ్వడం ద్వారా.. తన పార్టీ నీడ లోకి వారిని తీసుకువచ్చేస్తారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
తమిళ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ వ్యత్యాసంతో మాత్రమే.. ఇప్పడు అన్నా డీఎంకే అక్కడ పరిపాలన సాగిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో.. ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఫిరాయించినా.. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. హఠాత్తుగా అలాంటి సంక్షోభం తలెత్తితే ‘క్రైసిస్ మేనేజిమెంట్’ చేయగల అనుభవజ్ఞులు ఆ పార్టీకి లేరు. భాజపా జోక్యం చేసుకుంటే గనుక.. వారికున్న అనుభవంతో ఇలాంటి చికాకుల్ని సులువుగా చక్కబెట్టేయగలరు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఒక ప్రాంతీయ పార్టీకి దన్నుగా నిలవదలచుకుంటే.. ఆ పార్టీలో అంతర్గతంగా వినిపించే ధిక్కార, తిరుగుబాటు స్వరాలను తొక్కేయడం వారికి చిటికెలో పని. అలాంటి మేలు చేయడం ద్వారా.. అన్నా డీఎంకే శాశ్వతంగా ‘మోదీ కౌగిలి’ లోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ పరిణామాలు అన్నీ కార్యరూపం దాల్చి.. స్పష్టత రావడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. ఎందుకంటే.. అమ్మ మరణం నేపథ్యంలో తమిళ ప్రజలు, అభిమానుల్లో వెల్లువలా ఉన్న ఆవేశం పలచబడే దాకా.. అన్నా డీఎంకేలో ఎలాంటి ధిక్కార స్వరాలు వినిపించవు అని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

