ముద్రగడకు అంత పంతమెందుకు?

ముద్రగడ పద్మనాభం చాలా కాలంగా రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఆయన తక్షణ రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఏదైనా కార్యక్రమం చేపడుతున్నారని బురదచల్లడం అవివేకం అవుతుంది! కాపు సామాజిక వర్గం పట్ల ముద్రగడకు ఉన్న చిత్తశుద్ధిని అనుమానించే వారు ఎవ్వరూ లేరు! ఆయన ‘తన ప్రాణాలు కాపు జాతికి అంకితం’ అంటూ చాలా ఆకట్టుకునేలా చెబుతుంటారు గానీ.. కాపు అనేది జాతి కాకపోయినా, ఆ కులానికి తాను అంకితమైనంత నిబద్ధతతోనే ఆయన పనిచేస్తున్నారు. కాపుల రిజర్వేషన్ సాధించడాన్ని ఆయన జీవితాశయంగానూ ఎంచుకున్నారు. అందుకు పోరాటపథాన్నే అనుసరిస్తున్నారు.
పైన చెప్పుకున్న విషయాల్లో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. కాపుల్లోని ఆయన వ్యతిరేక గ్రూపులు అయినా, కాపేతర వ్య్తక్తులు అయినా.. రాజకీయ శత్రువులు అయినా.. ఎవరైనా సరే ఈ అంశాలను ఒప్పుకుని తీరాల్సిందే. అయితే అందరికీ కలుగుతున్న సందేహం ఒక్కటే. ముద్రగడ పద్మనాభం తాను చేపట్టదలచుకున్న ఆత్మగౌరవ పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం అంటోంటే.. పంతానికి పోతున్నారు ఎందుకు? అనుమతుల్లేకుండా పాదయాత్రలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించడానికి వీల్లేదంటూ.. పోలీసులు చట్టాల్ని ఉదాహరిస్తున్నప్పుడు.. అనుమతి అడిగి ఎంచక్కా పోలీసు సెక్యూరిటీని కూడా అడిగి పుచ్చుకుని పాదయాత్ర చేసుకోవాల్సిందిపోయి.. దాన్నుంచి తప్పించుకోడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు. ... ఈ విషయాలే ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇదివరకు ఆయన యాత్రను ప్రకటించినప్పుడు కూడా అనుమతుల కారణంగానే పోలీసులు ఆపేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో యాత్ర సాగుతుందని ముద్రగడ అంటున్నారు. గాంధేయమార్గంలోనే తన పాదయాత్ర ఉంటుందని చెబుతున్నారు. అంతా మంచిదే.. కాపులకు రిజర్వేషన్ లు కల్పిచాలనే ప్రయత్నంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అసమంజసమైన జాప్యం చేస్తున్నదనే అభిప్రాయం ఆయనకు ఉంటే.. ఆ విషయంలో వారిని జాగృతపరచడానికి ఇలాంటి పాదయాత్రల తరహా ఆందోళనలు చేయడం ప్రజాస్వామ్యంలో అవసరమే. అయితే .. అంతా బాగానే ఉంది. కానీ అనుమతి తీసుకోవడానికి తిరస్కారం ఎందుకు?
ముద్రగడ యాత్రకు అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడినా ముద్రగడ చాలా విలక్షణంగా స్పందిస్తారు. ఆరోజు చంద్రబాబునాయుడు ఎవరి అనుమతి తీసుకుని పాదయాత్ర చేశారు? అంటూ ప్రశ్నిస్తారు!! నిర్మొగమాటంగా చెప్పాలంటే ఇది అర్థంపర్థంలేని వాదన. ఆరోజున చంద్రబాబునాయుడు చేసిన పాదయాత్ర లక్ష్యాలు వేరు. అవి సార్వజనీనంగా ప్రజలకు సంబంధించినవి. పైగా అప్పుడు ప్రభుత్వ ఆంక్షలు, నిబంధనలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం నిబంధనలు ఉన్నాయని చెబుతోంటే.. ముద్రగడ ఖాతరు చేయనని అంటున్నారు.
అప్పటి చంద్రబాబు యాత్రతో పోల్చినప్పుడు , ఇవాళ ముద్రగడ చేస్తున్న యాత్ర ఒక కులానికి ప్రయోజనాలు చేకూర్చడం గురించినది. కాపు కమిషన్ అభిప్రాయ సేకరణలకు జిల్లాలు తిరుగుతున్నప్పుడు.. కాపేతర బీసీలు- రిజర్వేషన్లు ఇవ్వరాదంటూ ఎంతగా రచ్చ చేస్తున్నారో అందరికీ తెలుసు. కొన్ని చోట్ల ఘర్షణలు కూడా జరిగాయి. అలాంటి వారిలోని అల్లరి మూకలు ముద్రగడ దీక్ష మీద దాడులకు దిగితే ఏంటి పరిస్థితి! దాడి సంగతి సరే.. దొంగచాటుగా ఉండి రాళ్లు రువ్వితే ఏంటి పరిస్థితి.
ముద్రగడ చాలా మంచి వారు గనుక.. ఆయన గాంధేయమార్గంలోనే చాలా శాంతియుతంగా పాదయాత్ర చేస్తారని అనుకుందాం. కానీ కాపేతర బీసీలు ఇలాంటి అల్లరికి దిగితే.. ఎవరు జవాబుదారీతనం వ్యవహరించాలి. అలాంటి నేపథ్యం శాంతి భద్రతలు అదుపుతప్పడానికి దారితీస్తే అందుకు ఎవరు బాధ్యత తీసుకోవాలి? అప్పుడు అందరూ కలిసి ప్రభుత్వం ఏం చేస్తున్నదంటూ నిందించకుండా ఉంటారా? సాధ్యమేనా?
అయినా.. కాపుగర్జన సభను కూడా గాంధేయమార్గంలో శాంతియుతంగా నిర్వహించాలన్నదే ఆనాడు ముద్రగడ సంకల్పం. కానీ ఏం జరిగింది. రైళ్లను కూడా తగులబెట్టారు. అలాగని ఇప్పుడు కూడా ముద్రగడ వెనుక పాదయాత్రలో పాల్గొనే వాళ్లు హింసాత్మక సంఘటనలకు తెగబడతారనేది మన ఉద్దేశం కాదు... కాకపోతే తమ మీద దాడులు జరిగి, వీరు ప్రతిదాడులకు దిగి.. ఘర్షణలు ముదిరితే దానికి బాధ్యత ముద్రగడ వహిస్తారా? అయినా తగాదాలు, తలలు పగలడాలూ అయిన తర్వాత.. ఎవరు బాధ్యత వహిస్తే మాత్రం ఏముంది. ఎంచక్కా ముద్రగడ పోలీసు అనుమతి తీసుకుని, పోలీసు సెక్యూరిటీని కూడా వెంట తీసుకుని యాత్ర చేస్తే ఎంత బాగుంటుంది?
ముద్రగడ అనుమతి విషయంలో అర్థంలేని పంతానికి పోతున్నారు. ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది గనుక.. దాన్ని ధిక్కరించడం ద్వారా రచ్చ చేయడమే ఆయన లక్ష్యంగా ఉన్నది తప్ప.. యాత్ర చేయడం అనే కోరిక ఉన్నట్లుగా లేదు. వ్యవస్థలోని చట్టాన్ని , వ్యవస్థను గౌరవించలేని వ్యక్తి, తన కులం కోసం అదే వ్యవస్థ లో ఒక వెసులుబాటును, ఏర్పాటును (కాపు రిజర్వేషన్) కోరడం అనేది గొప్ప కామెడీ. అందుకే ముద్రగడ అంటే గౌరవం ఉన్న తటస్థులు, ఆయన పోలీసు అనుమతితోనే.. అధికారికంగానే తన యాత్ర నిర్వహించాలని కోరుకుంటున్నారు.

