ప్రియమైన కేటీఆర్... ఇట్లు మీ విధేయుడు

ప్రియమైన కేటీఆర్ గారూ... తెలంగాణ రాజకీయాల్లో మీకు విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా మంత్రుల లాగా దర్పం ప్రదర్శించకుండా మీరు జనంలో కలిసిపోతూ అనేక కొత్త పోకడలు పోతుంటారు. అందుకే ప్రజలకు మీరంటే ఇష్టం. అయ్యా.. మీరు కనీసం ఒక్కసారి ఆత్మవంచన చేసుకోకుండా చెప్పండి.. నానక్ రామ్ గూడా లో ఇవాళ జరిగిన భవనం కూలిపోయిన ప్రమాదం , శిధిలాల కింద చిక్కుకుపోయి గంటల తరబడి జనం హాహాకారాలు... వీటన్నిటికీ మూలకారణం ఎవరు? అసలైన పాపాల భైరవుడు ఎవరు?
ప్రమాద స్థలాన్ని పరిశీలించినప్పుడు ఇతర మంత్రుల లాగానే మీరు కూడా మూస డైలాగులు వల్లిస్తోంటే కాస్త బాధ కలుగుతోంది. బిల్డర్ ల కక్కుర్తి కారణంగా ఈ ఘోరం జరిగినట్లు మీరు సెలవిచ్చారు. ఆత్మసాక్షిగా మీరు ఆ మాట చెప్పగలుగుతున్నారా? ఈ పాపం వెనుక మునిసిపల్ అధికారుల మహాపాపం, బాధ్యత లేదని చెప్పగలరా? మునిసిపల్ శాఖకు కూడా మంత్రి మీరే గనుక ఆక్రోశాన్ని మీతోనే పంచుకోవాలని అనిపిస్తోంది.
350 గజాల్లో 6 ఫ్లోర్లు మరియు పెంట్ హౌస్ అనేది బిల్డర్ సత్తు సింగ్ తప్పే. కాదనడం లేదు. కానీ అనుమతులు ఇచ్చిన అధికారుల సంగతేమిటి? అనుమతులను మించి నిర్మాణం. చేస్తున్నా మునిసిపల్ అధికారుల కళ్ళ పడలేదా? ఉపేక్షించిన లేదా ప్రోత్సహించిన అధికారుల దన్ను లేకుండానే ఈ పాపం జరిగిందా?
బిల్డర్ కు ధైర్యం చాలకపోయినా సరే.. నువ్వు కానివ్వు బాసూ... నేను చూసుకుంటా కదా అంటూ దగ్గరుండి పాపం చేయించే అధికారులు కూడా ఉన్నారు. అలాంటి ధూర్త అధికారుల శాఖకు తమరు సచివులు. ఎప్పుడూ పరనిందలతో పొద్దుపుచ్చే వైఖరిని కనీసం మీరయినా మార్చుకోండి. బిల్డర్ తో పాటూ సంబంధిత ghmc అధికారులు అందరి మీద హత్య కేసులు పెట్టించండి. కేటీఆర్ గ అప్పుడు మీ చిత్తశుద్ధిని జనం నమ్ముతారు. పాపాలకు పాల్పడేవాళ్ళ వెన్నులో వణుకు పుట్టించే నిర్ణయాలు తీసుకోండి. జనం పదికాలాలు మీ పేరు చెప్పుకుంటారు.
ఇట్లు
మీ విధేయుడు

