ప్రజలారా.. ఆనాటి తిట్లు గుర్తుంటే.. పోల్చి చూసుకోండి!!

అయిన వారికి ఆకుల్లో... కాని వారికి కంచాల్లో అని మన పల్లెపట్టుల్లో ఒక నాటు సామెత ఉంది. తెలుగుదేశం పార్టీ రాజకీయాలు కూడా అచ్చం ఆ సామెత చందంగానే కనిపిస్తున్నాయి. తెలుగుదేశంలోని ముఖ్య నాయకులు తమ మీధ ఒకే తరహా నిందలు జగన్ వేస్తే ఒక రకంగానూ, పవన్ కల్యాణ్ వేస్తే మరో రకంగానూ స్పందిస్తున్నారు. జగన్ నిందలు వేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ వారంతా ఎదురు దాడికి విరుచుకుపడిపోతూ ఉంటారు. అవే తిట్లు పవన్ కల్యాణ్ తిడితే మాత్రం.. ఆ తిట్లు చాలా తియ్యగా ఉన్నట్లుగా స్వీకరిస్తున్నారు. అనివార్యంగా ఇలాంటి ద్వంద్వ నీతి పోకడ తెలుగుదేశం వారి వైఖరిలో కనిపిస్తుందనే ఉద్దేశంతోనే తెలుగుపోస్ట్ నాలుగు రోజుల కిందట ఒక ప్రత్యేక కథనాన్ని అందించింది. ‘‘ప్రజలారా.. ఈ తిట్లు మొత్తం గుర్తుంచుకోగలరు!’’ అనే శీర్షికతో ఇచ్చిన ఆ కథనంలో జగన్ సభ తర్వాత.. తెదేపా మంత్రులంతా ఎలా స్పందించారో గుర్తుంచుకుంటే.. అనంతపురంలో పవన్ సభ తర్వాత ఎలా స్పందిస్తారో కంపేర్ చేసుకోడానికి బాగుంటుందని సూచించడం జరిగింది.
అచ్చంగా తెలుగుపోస్ట్ తన కథనంలో సూచించినట్లే పరిణామాలన్నీ జరిగాయి. హోదా గురించి గానీ, ప్యాకేజీ గురించి గానీ, తెలుగుదేశం పార్టీలో అవినీతి గురించి గానీ.. జగన్ ఏ తరహాలో అయితే మాట్లాడారో పవన్ కల్యాణ్ కూడా తన అనంతపురం ప్రసంగంలో అవే నిందలు వేశారు. కాకపోతే.. కొద్దిగా మెత్తగా వడ్డించారు. తెలుగుదేశం ప్రతిస్పందనలో మాత్రం హస్తిమశకాంతరం అనదగినంతటి వ్యత్యాసం ఉంది. జగన్ ను ఓ రేంజిలో తెదేపా మంత్రులంతా ఆటాడుకుంటూ.. ఆయన నేరస్తుడని, జైలుకు వెళ్తాడని, బెయిలు మీద ఉన్నవాడు నీతులు మాట్లాడ్డం ఏంటని రకరకాలుగా తిట్టిన వాళ్లంతా.. పవన్ కల్యాణ్ ను మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. ఏదో ఒకరిద్దరు నోరుజారి ప్రతి విమర్శలు చేశారు. మంత్రి చినరాజప్ప లాంటి వాళ్లయితే పవన్ విమర్శలను సూచనగా స్వీకరిస్తాం అంటూ సెలవిచ్చారు. అంతలోనే పార్టీ శ్రేణులందరికీ బహిరంగ సంకేతం ఇస్తున్నట్లుగా ‘‘పవన్ కల్యాణ్ మాటలను మనం పాజిటివ్‌గా తీసుకుందాం. మనలో లోపాలు ఉంటే దిద్దుకునే ప్రయత్నం చేద్దాం’’ అంటూ నారా లోకేశ్ ఓ సందేశం ఇచ్చి అందరి నోర్లు మూయించారు.
పవన్ కల్యాణ్ విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా మెత్తగా ఉంటుందని తేలిపోతూనే ఉంది. ఆయనను తమ మిత్రపక్షంగా పరిగణిస్తున్నట్లుగానే వారు ప్రవర్తిస్తూ ఉంటారు. పవన్ కల్యాణ్ మీద కూడా ఎదురు దాడికి దిగి, ఎడా పెడా తిట్టేస్తే గనుక సామాజికవర్గ సమీకరణాల పరంగా కూడా.. తమకు చికాకులు తప్పవనే వెరపు తెలుగుదేశం పార్టీలో ఉంది. ఆ రకంగా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని వారు ఆయన పట్ల ఆ మెతకదనం చూపిస్తుంటారు. పవన్ కల్యాణ్ కూడా.. చంద్రబాబునాయుడు ప్యాకేజీని ఆమోదించే విషయాన్ని గానీ, తెలుగుదేశం సర్కారులో పెరుగుతున్న అవినీతి గురించి గానీ.. తన ప్రసంగంలో ప్రస్తావించాల్సి వస్తే.. తలుపు చెక్కతో వడ్డించాల్సిన చోట.. తమలపాకుతో స్పృశించి అక్కడితో దాటవేస్త్తుంటారు.
మొత్తానికి పవన్ కల్యాణ్ మరియు తెలుగుదేశం పార్టీ మధ్య విపక్షం రూపంలో ఒక రరకమైన విచిత్రమైన ప్రేమానుబంధం కొనసాగుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

