పాక్ వాదనకు జైకొడుతున్నట్లుగా కాంగ్రెస్ వైఖరి!

పాకిస్తాన్ మీద సర్జికల్ దాడుల విషయంలో.. భారతదేశంలోని పార్టీలన్నీ ఒక్కతాటి మీద ఉన్నట్లుగా కనిపించాయి. దాడులు జరిగిన రోజున కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు ఐక్యంగా ఉన్నట్లే కనిపించాయి. అందరూ కలసికట్టుగా సైనిక సర్జికల్ దాడులకు సంఘీభావం తెలియజేశాయి. జాతీయతా వాదం విషయంలో.. అన్నిపార్టీలు ఒకటిగా ఉన్నందుకు జాతి మొత్తం కూడా సంతోషించింది. అదే సమయంలో.. మన సైన్యానికి అభినందనలు తెలియజేసి.. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసింది కూడా.
కానీ కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ వైఖరి మారిపోయినట్లుంది. ఇప్పుడు ఆ పార్టీ ఎప్రోచ్ ఎలా కనిపిస్తున్నదంటే.. సర్జికల్ దాడుల విషయంలో పాకిస్తాన్ వాదనకు వీరు మద్దతిస్తున్నట్లుగా ఉంది.
విషయం ఏంటంటే.. మనం సర్జికల్ దాడులు చేసినట్లుగా ప్రకటించుకున్నాం. దానికి సంబంధించి యుద్ధ వాతావరణం నెలకొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ సర్జికల్ దాడులన్నీ ఒక కట్టు కథ అంటూ పాకిస్తాన్ ప్రభుత్వం కొట్టి పారేసిన సంగతి మనకు తెలుసు. పాకిస్తాన్ సర్కారు అక్కడి మీడియాను సరిహద్దులకు తీసుకువెళ్లి.. అక్కడ అసలు దాడులు జరగనే లేదనే సంగతిని ప్రచారంలోకి తెచ్చింది. ఈ విషయంలో రెండు దేశాలు పరస్పర భిన్నమైన వాదనలు చేసుకుంటూ ఉన్నాయి.
ఇలాంటి సమయంలో మన దేశంలోని పార్టీలన్నీ ఒకే మాట మీద ఉంటే సాధారణంగా బాగుంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ , పాకిస్తాన్ వాదనను భుజాన మోస్తున్నట్లుగా కనిపిస్తోంది. సర్జికల్ దాడులు జరిగింది నిజమే అయితే.. మోదీ సర్కారు అందుకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేస్తోంది. అయితే తెలివిగా, దాడులు జరగలేదని అంటున్న పాక్ ఆరోపణలకు అడ్డుకట్ట వేయడానికి ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉన్నదంటూ కాంగ్రెస్ మెలిక పెడుతుండడం విశేషం. కనీసం పొరుగు దేశంతో వ్యవహరించేప్పుడైనా.. ఇలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం కక్కుర్తి పడే వైఖరిని వదులుకోవాలని అనుకోని కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసహనం కలుగుతోంది.

