టీటీడీపీ లో ఆధిపత్య పోరాటాలే చంద్రబాబుకు సవాళ్లు!

తెలంగాణ తెలుగుదేశ పార్టీ ప్రస్తుతం అత్యంత దయనీయమైన స్థితిలో కునారిల్లుతున్ సంగతి అందరికీ తెలిసిందే. మీడియా ముందుకు వచ్చే సందర్భాల్లో మాత్రం.. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అని ఈ పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. అయితే అధికారం సంగతి తర్వాత.. కనీసం అస్తిత్వానికి ఇబ్బంది లేనంత పటిష్టమైన పార్టీగా తెలుగుదేశం మనుగడను కాపాడాలంటే వారు చాలా కష్టపడాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో పార్టీలో మిగిలిన కొందరు నాయకుల మధ్య లోలోపల నిప్పులా రగులుతున్న ఆధిపత్య పోరాటాలు పార్టీకి పెనుష్టం కలిగిస్తున్నాయి. ఇలాంటి సంక్లిష్ట సమయంలో తెదేపా విస్తృతస్థాయి సమావేశం దాదాపు 9 నెలల తర్వాత ఇవాళ జరగబోతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సభ్యత్వ నమోదులను సమీక్షించి, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేస్తారన్నది ఎజెండా! కానీ వాస్తవంలో పార్టీకి చేటు చేస్తున్న ఆధిపత్య పోరాటాలకు ఫుల్స్టాప్ పెట్టి.. నేతల మధ్య సయోధ్య సాధించడం ఆయన ముందున్న అతిపెద్ద సవాలు.
తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం నాయకత్వ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో మిగిలిన నాయకుల్లో ఏదో ఆపద్ధర్మంగా ఉన్నట్లు కొనసాగుతున్న వాళ్లూ కొందరున్నారు. యాక్టివ్ గా ఉండే వారి మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రత్యేకించి కేసీఆర్ సర్కారు మీద నిత్యం విరుచుకు పడుతూ ఉండే రేవంత్ రెడ్డి , పార్టీతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారంటూ ఇతర నేతల ఆరోపణలున్నాయి.
రెండురోజుల కిందట నల్గొండ జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులు చంద్రబాబును కలిసి, రేవంత్ రెడ్డి తాను చేపడుతున్న కార్యక్రమాల్లో ఒక కులానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని, తెలుగుదేశానికి అసలు బలం అయిన బీసీలను కలుపుకుని పోవడం లేదని ఫిర్యాదు చేశారు. అలాంటి నేపథ్యంలో అందరి మధ్య సయోధ్య తీసుకువస్తే తప్ప.. అసలే ముక్కిడి ఆపై పడిశం అన్న సామెత చందంగా ఉన్న పార్టీ పరిస్థితి మెరుగుడపకపోవచ్చు. మరి టిటిడిపి పార్టీ నాయకులతో ఇవాళ సమావేశం అవుతున్న చంద్రబాబు ఏ మేరకు ఫోకస్ పెట్టగలరో చూడాలి.

