జైట్లీకి సత్కారం ఆత్మహత్యా సదృశమే!

చంద్రబాబునాయుడు ఇవాళ అరుణ్ జైట్లీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చి., ఆయన ద్వారా కోర్ కేపిటల్ భవనాలకు శంకుస్థాపన చేయించి తద్వారా ఎంతో కొంత మైలేజీ సాధించాలని అనుకుంటున్నారు గానీ.. వాస్తవానికి ఆ నిర్ణయం పట్ల ఆయన పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు మోనార్క్ గనుక.. ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి నాయకులు ఎవ్వరూ సాహసించడం లేదు గానీ.. అరుణ్ జైట్లీని ఎంత ఘనంగా సత్కరిస్తే.. అది తమ పార్టీకి అంతగా ఆత్మహత్యా సదృశం అవుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులే అంటున్నారు. మోదీతో గత విజయదశమికి చేయించిన శంకుస్థాపనే ఒక రేంజిలో అపకీర్తి తెచ్చి పెట్టిందని, ఇప్పుడు జైట్లీని నెత్తిన పెట్టుకోవడం కూడా చేటుచేస్తుందని వారంటున్నారు. వారి వాదన ఇలా ఉంది.
అరుణ్ జైట్లీ ఇచ్చిన (ప్రకటించిన) ప్యాకేజీ పట్ల రాష్ట్రంలో ప్రజలు సంతృప్తికరంగా లేరు. విభజన జరిగిపోయిన తరువాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దారుణంగా వంచించిన వారిలో అరుణ్ జైట్లీ ముందు వరుసలో ఉంటారని ప్రజలు నమ్ముతున్నారు. మరోవైపు అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీ రాష్ట్ర సంక్షేమానికి పెద్దగా ఉపయోగపడేదేమీ కాదని, అంతా మాయ అని.. ప్రజల్లో ఒక చైతన్యం కలిగించడంలో విపక్షాలు ఒక మేరకు సక్సెస్ అయ్యాయి. ఆ నేపథ్యంలో జైట్లీని నెత్తిన పెట్టుకోవడం ప్రజలకు ఆగ్రహమే తెప్పిస్తుంది. ఈ రెండు కారణాలకు తోడు కీలకమైన మరో కారణాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు.
అసలే.. రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదని, సకలం కేంద్రంనుంచి వస్తున్న సొత్తులేనని ప్రచారం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో వేళ్లూనుకోవడానికి ప్రయత్నిస్తోంది. అలాంటి నేపథ్యంలో జైట్లీని చంద్రబాబు నెత్తినె పెట్టుకుంటే గనుక.. అది భాజపాకు ఎడ్వాంటేజీ అవుతుంది తప్ప.. తెలుగుదేశానికి కలిగే మేలేమీ ఉండదని కూడా అంటున్నారు. పైగా ఇదే రోజున జైట్లీకి విజయవాడలో భాజపా పార్టీ తరఫున ఒక సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. తద్వారా వారు నిధులంతా తమ పార్టీ పుణ్యమే అని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి చంద్రబాబు వారికి అలాంటి అవకాశం ఇవ్వకుండా, అంతా భాజపా వల్లనే జరుగుతోందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని తెదేపా నాయకులు భావిస్తున్నారు.

