జేపీ సూచన భేష్ : మోదీకి అంత ధైర్యముందా?

రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా, ఆచరణాత్మకమైన దృక్పథంతో మాత్రమే, ప్రజల దృష్టిలో మాత్రమే మాట్లాడే నాయకుడిగా లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్‌కు గుర్తింపు ఉంది. తాజాగా మోదీ సర్కారు తీసుకున్న పెద్ద నోట్ల నిషేధం అంశాన్ని జేపీ సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. అయితే దేశంలో ఆర్థిక అవకతవకలను చక్కదిద్దడానికి, ప్రజల్లో ఎగవేత ధోరణులను తగ్గించడానికి ఇదొక్క చర్య సరిపోదని జేపీ అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో వాస్తవంగా మార్పు రావాలంటే.. ప్రభుత్వం తీసుకోవాల్సిన కొన్ని చర్యలను జేపీ సూచిస్తున్నారు. నిజానికి జేపీ సూచనలు ఆచరణాత్మకంగా భేషుగ్గానే ఉన్నాయి గానీ.. మోదీ ప్రభుత్వానికి ఇలాంటి మంచి సూచనలను అమల్లో పెట్టగల ధైర్యం ఉందా అనేది చాలామందిలో కలుగుతున్న సందేహం.
నోట్ల నిషేధం వంటిది ఆర్థిక సంస్కరణలకు ఒక హేతువు కాగలదే తప్ప.. ఇదొక్క నిర్ణయంతో సమస్తం జరిగిపోదని జేపీ అంటున్నారు. ఈ నిర్ణయం రాజకీయ గిమ్మిక్కుగా మిగిలిపోకుండా ఉండాలంటే.. పన్నులు తగ్గించడం, ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయడం అనివార్యంగా చేపట్టాలని జేపీ పిలుపు ఇస్తున్నారు.
ప్రజలనుంచి పన్నుల రూపేణా వసూలు చేస్తున్న భారీ మొత్తాల సొమ్మును ప్రజల సేవలకోసం, వారి సంక్షేమం కోసం ఖర్చు చేయడం కాకుండా, నాయకుల విలాసాలకు ఉద్యోగులకు జీతాలు పెంచడానికి ఖర్చు చేసే అలవాట్లు ప్రభుత్వాలు మార్చుకోవాలని జేపీ పిలుపు ఇస్తున్నారు.
నిజానికి ఈ సూచనలు చాలా మంచివి. దేశంలో పన్నులు అనేవి అడ్డగోలుగా ఉన్నందువల్లనే వాటిని ఎలా ఎగవేయాలా అనే ధోరణులు ప్రజల్లో పెరుగుతున్నాయి. మరి నల్లధనాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకునే ప్రక్రియలో భాగంగా పన్నుల విధానాన్ని కూడా సంస్కరించి మరింత సరళీకృతం చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అనేది చాలా పెద్ద ప్రశ్న. పన్నుల వ్యవస్థను చక్కదిద్దనంత వరకూ ప్రభుత్వమే ప్రజల్లో ఎగవేత ధోరణులను ప్రోత్సహిస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. జేపీ లాంటి మేధావులు చెప్పిన కారణాలనైనా ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకుని తమ సాంప్రదాయ పన్నుల వసూళ్ల అలవాట్లను మార్చుకుంటే తప్ప.. ఆర్థికంగా స్థిరమైన నిజాయితీ గల సమాజపు ఆవిష్కరణ దిశగా అడుగులు పడడం కష్టం అని పలువురు భావిస్తున్నారు.

