జగన్ ఎన్నికల స్వప్నం బ్యాక్‌ఫైర్ అయిందా?

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో... అంటే కొన్ని నెలలు కూడా గడవక ముందునుంచి విపక్షనాయకుడు జగన్మోహనరెడ్డి ప్రజల వద్దకెళ్లి ఎప్పుడు మాట్లాడినా.. ’’త్వరలోనే ఎన్నికలు వస్తాయి.. రాజన్న రాజ్యం వస్తుంది.. మన ప్రభుత్వం రాగానే మీ సమస్యలు అన్నీ తీర్చేస్తా’’ అని అంటుండడం గమనించి.. ‘ఏదో అత్యుత్సాహంలో ఉన్నాళ్లే ఇంకా’ అని జనం సరిపెట్టుకున్నారు. కానీ.. తాజాగా ఇప్పుడు కూడా.. వచ్చే ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి అని జగన్ చెబుతున్నారంటే.. ఎందుకలా చెబుతున్నారా? అని ఆలోచించాల్సిందే. అయితే.. ఆయన ఏదో పదవి మీద తనకు ఆశ ఉన్నది గనుక.. అనాలోచితంగా అంటున్న మాటలు మాత్రం కావవి. తరచి చూస్తే ఆయన నిజంగానే.. వచ్చే ఏడాది ఎన్నికలు వస్తాయని నమ్ముతున్నట్లుగా కనిపిస్తోంది.
జగన్‌లో అలాంటి నమ్మకం ఏర్పడడానికి కారణం.. మోదీ సర్కారే. పరిపాలనలో ఎన్నో సంస్కరణలను తీసుకురావాలని భావిస్తున్న మోదీ ప్రభుత్వం.. ‘ఒకదేశం-ఒక ఎన్నికలు’ నినాదానికి కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే కార్యరూపం ఇస్తుందని నమ్ముతున్న దేశంలోని అతికొద్దిమంది వ్యక్తుల్లో జగన్ కూడా ఒకరు. దేశంలో అపరిమితంగా పెరిగిపోతున్న ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడానికి ఎన్నికల సంఘంతో కలిసి మోదీ సర్కార్ చేపట్టగల అనేక సంస్కరణలకు ఈ ‘ఒకదేశం-ఒక ఎన్నికలు’ నినాదం తొలిమెట్టు అవుతుందని జగన్ లాంటి వాళ్లు అనుకుంటున్నారు. దేశంలోని కొన్ని ప్రభుత్వాలను రద్దుచేసి, కొన్ని ఎన్నికలను వాయిదా వేస్తే తప్ప.. ఇలాంటి ప్రయత్నం కార్యరూపం దాల్చదు.
ఆ లెక్కన వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగాల్సి ఉన్న కొన్ని రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాలి. అప్పటికి ఇంకా రెండు మూడేళ్ల పదవీకాలం ఉండే రాష్ట్ర ప్రభుత్వాలన్నిటినీ రద్దుచేయాలి.
అలాంటి ప్రయత్నం మోదీ సర్కారు చేస్తుందనే నమ్మకం జగన్ కు ఉంది. ఈ మేరకు మోదీ ఎన్నికల సంఘం సిఫారసుల్ని సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు ఆయనకు సమాచారం ఉన్నదేమో మనకు తెలియదు. కాకపోతే జగన్ ఏదో ప్రజల్లో యథాలాపంగా వచ్చే ఏడాది ఎన్నికలొస్తాయి అనడం మాత్రమే కాదు.. తన పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కూడా ఈ విషయాన్ని చాలా స్ట్రాంగుగా చెప్పారుట. మొత్తానికి ఆయన దాన్ని బాగా నమ్ముతున్నారు. సిద్ధమవుతున్నారు.
బ్యాక్‌ఫైర్ అయిందా...
జగన్ ఎన్నికల మీద ఆశపడడం అనేది ప్రజల వద్ద ప్రహసనంగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆయన తొలినుంచి ఇదే పాట పాడుతున్నారు. తాజాగా మళ్లీ ఇలాంటి మాట చెప్పడంతో తెలుగుదేశం నాయకులంతా ఆయనను ఒక రేంజిలో ఆడిపోసుకుంటున్నారు. జగన్ ది అమాయకత్వం అని, జగన్ కు పిచ్చి పట్టిందని ఎవరికి తోచిన రీతిలో వారు విమర్శిస్తున్నారు.
‘ఒకదేశం-ఒక ఎన్నికలు’ జరుగుతాయని జగన్ కు రహస్య సమాచారం కూడా ఉండవచ్చునేమో గానీ.. జనాలకు అది అప్పుడే అర్థం కాని కాన్సెప్టు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడే జగన్ దాని గురించి మాట్లాడితే వారికి కామెడీగా ఉంటుంది .. అంతే కదా!

